మనవడి బారసాల.. ఇళ్లంతా సందడి.. కానీ చూస్తుండగానే..!

9 Jun, 2022 10:54 IST|Sakshi

ప్రమాదవశాత్తు సిలిండర్‌ పేలడంతో మురళీనగర్‌లో కాలిపోయిన మూడిళ్లు, మరో మూడు పాక్షికంగా దగ్ధం

కలిసికట్టుగా అగ్ని ప్రమాదాన్ని అరికట్టిన గ్రామస్తులు

రూ.4లక్షల నగదు.. రూ.3లక్షల ఆస్తి నష్టం

కట్టుబట్టలతో రోడ్డునపడ్డ కుటుంబాలు

పరామర్శించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి 

నల్లబెల్లి: మనవడి బారసాల కనుల పండువలా చేయాలనుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మనవడి వద్దకు వెళ్లారు. సాయంత్రం వరకు బారసాలకు సిద్ధపడుతూ సంబరాల్లో మునిగితేలారు. ఇంతలోనే అగ్ని ప్రమాదం వారి సంబరాలను బుగ్గి చేసింది. దీంతో కట్టుబట్టలతోపాటు సర్వస్వం కోల్పోయారు. ఈ విషాద సంఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్‌ శివారు మురళీనగర్‌ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు ఎవరూ ఇళ్ల వద్ద లేనప్పటికి గ్రామస్తులందరూ కలిసికట్టుగా అగ్ని ప్రమాదాన్ని అరికట్టారు. ఈ ప్రమాదంలో రూ.4లక్షల నగదుతోపాటు రూ.3లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.  

 గౌరబోయిన మొండయ్యతోపాటు తన ఇద్దరు కొడుకులు సాంబరాజు, ముకేష్‌లు మురళీనగర్‌లో 10 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మొండయ్య చిన్న కుమారుడు ముకేష్‌ కుమారుడి బారసాల కోసం బుధవారం రాత్రి చెన్నారావుపేటలో ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో మొండయ్య తన కుటుంబ సభ్యులతో బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి చెన్నారావుపేటకు వెళ్లారు. బారసాల పనుల్లో నిమగ్నమై సంబురంగా గడుపుతున్నారు. అయితే సింగం నర్సయ్య సమీపంలోని వ్యవసాయ పనులకు వెళ్లగా.. బానోత్‌ శంకర్‌ కుటుంబ సభ్యులతో కలిసి తన సోదరి వద్దకు అప్పు తెచ్చేందుకు వెళ్లాడు.

ముందుగా మొండయ్య ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. సమీపంలోని సంగం నర్సయ్య, బానోత్‌ శంకర్‌ ఇళ్లకు మంటలు వ్యాపించాయి. మరో మూడిళ్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. దీంతో అప్రమత్తమైన పంచాయతీ కార్యదర్శి రజిత మంచినీటి ట్యాంక్‌ నుంచి గ్రామానికి నీటిని విడుదల చేసింది. గ్రామస్తులంతా కలిసికట్టుగా నల్లాల ద్వారా వచ్చిన నీటిని ఇళ్లపై చల్లి మంటలను అదుపు చేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు నర్సంపేట అగ్నిమాపక కేంద్రం ఎస్‌ఎఫ్‌ఓ వి.సుధాకర్‌తోపాటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పివేశారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ
విషయం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హుటాహుటిన మురళీనగర్‌ గ్రామానికి చేరుకున్నారు. కాయకష్టం చేసి కూడబెట్టుకున్న డబ్బు, తిండి గింజలు సైతం కాలిబూడిదయ్యాయని.. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని, తాము ఇప్పుడెలా బతికేదని బాధితులు ఎమ్మెల్యేపై పడి బోరున విలపించారు. ధైర్యం కోల్పోవద్దని బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తనవంతుగా రూ.40వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు సింగిరికొండ మాధవశంకర్, పట్టణ అధ్యక్షుడు వంగేటి గోవర్ధన్‌లు బాధిత కుటుబ సభ్యులకు రూ.19వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎమ్మెల్యే వెంట కొండాపూర్‌ సర్పంచ్‌ గూబ తిరుపతమ్మ, పంచాయతీ కార్యదర్శి రజిత, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ దళ నాయకుడు సూర్యం తదితరులు ఉన్నారు.

కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలు
ఈ ప్రమాదంలో ఇళ్లు దగ్ధమైన మూడు కుటుంబాల సభ్యులు కట్టుబట్టలతో రోడ్డునపట్టారు. ఖరీఫ్‌ సీజన్‌ కావడంతో పెట్టుబడి కోసం డబ్బులు, ఎరువులు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచుకున్నారు. ఈ ప్రమాదంలో గౌరబోయిన మొండయ్య ఇంట్లో రూ.3లక్షల నగదు, సింగం నర్సయ్య ఇంట్లో రూ.లక్ష నగదుతోపాటు బానోత్‌ శంకర్‌ సర్వం కోల్పోయారు.

చదవండి: Siddipet Crime: మల్లేశంతో ప్రేమ వివాహం.. ఐదేళ్లయినా..

మరిన్ని వార్తలు