‘పట్టా’లెక్కని ధరణి

3 Jul, 2022 00:59 IST|Sakshi
న్యాయ సహాయం కోసం భారీగా వచ్చిన రైతులు.. 

తొలి భూ న్యాయ శిబిరంలో భారీగా అర్జీలు

ఒక్క ఊరిలోనే రెండు వందల ఫిర్యాదులు 

నిషేధిత జాబితాల్లోనే 30శాతం భూములు 

రీ అసైన్‌ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు 

ధరణి వచ్చినా తీరని రైతాంగం అవస్థలు 

సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘‘మా నాయిన అరవై రెండేళ్ల కింద 1.28 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆయన పేరుమీద పాస్‌ పుస్తకం కూడా ఉంది. నా యిన చనిపోయిన తర్వాత నా పేరుమీద 1.04 ఎకరాల భూమి మాత్రమే పట్టా వచ్చింది. మిగతా 24 గుంటల భూమి నాపేరిట పట్టా చేయడం లేదు. తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగి నా సమాధానం చెప్పేవారే లేదు.

ఇది ఎవరి మాయో అర్థం కావడం లేదు’’.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన గుండగాని సోమయ్య బాధ ఇది. ఆయన ఒక్కరే కాదు.. పెద్ద సంఖ్యలో రైతులు ఇలా ఆగమవుతున్నారు. భూమి ఉన్నా పట్టాదారు పుస్తకం లేకపోవడం, పాస్‌ పుస్తకంలో భూమి ఉన్నా పొజిషన్‌లో లేకపోవడం, తండ్రి నుంచి వారసత్వంగా రావాల్సిన ఫౌతి కోసం ధరణిలో ఆప్షనే లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

శనివారం సూర్యాపేట జిల్లా వెంపటిలో నల్సార్‌ యూనివర్సిటీ అనుబంధ ఆచార్యుడు భూమి సునీల్, తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపకుడు వి.లచ్చిరెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి భూన్యాయ శిబిరంలో ఏకంగా రెండు వందల మంది రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. ధరణి వచ్చాక కూడా ఈ ఒక్క గ్రామంలోనే 30శాతం భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని.. ఒకరి భూములు మరొకరి పేరిట నమోదయ్యాయని గుర్తించారు.

ఈ గ్రామంలో సర్వే నంబర్ల వారీగా పరిశీలన చేశాక.. సుమారు 40శాతం మందికి చిన్న, పెద్ద సమస్యలున్నట్టు గుర్తించారు. ధరణిలో దరఖాస్తు చేస్తే సులువుగా పరిష్కారమయ్యే వాటిని గుర్తించి.. అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేశారు. 

ప్రధాన భూ సమస్యలివీ..
►చాలా మంది రైతులు సాదా బైనామాల ద్వారా భూములు కొని క్రమబద్ధీకరణకు దరఖాస్తులు పెట్టుకున్నారు. కొందరి దగ్గర రశీదులు ఉన్నాయి, మరికొందరి దగ్గర లేవు. అయితే చాలా మందికి క్రమబద్ధీకరణ జరగలేదు. కొంత మందికి 13బి సర్టిఫికెట్‌ వచ్చిందిగానీ.. ఆ సర్టిఫికెట్‌తో పాస్‌ పుస్తకం పొందే ఆప్షన్‌ ధరణిలో లేదు. 

►పట్టా భూములై ఉండి కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడం, భూవిస్తీర్ణాల్లో హె చ్చుతగ్గులు రావడం, ఒకరి విస్తీర్ణం మరొకరికి పేరుపైన చేర్చడం వంటి సమస్యలు ఉన్నాయి. 

►అసైన్‌మెంట్‌ భూములు కొనుగోలు చేసిన నిరుపేదలకు రీఅసైన్‌మెంట్‌ జరగలేదు. రీఅసైన్‌మెంట్‌ జరిగి పట్టాలు వచ్చినా ధరణిలో ఆప్షన్‌ లేకపోవడం వల్ల పట్టాదారు పాస్‌ పుస్తకాలు రాలేదు. 

►భూసర్వేకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గెట్టు తగాదాలు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. భూసర్వే కోసం దరఖాస్తు చేసినా సర్వే జరగలేదు. 

►ఇప్పటికే ధరణిలో దరఖాస్తు చేసుకున్నవేగాక.. ఇంకా దరఖాస్తు చేసుకోనివీ ఉన్నాయి. మరికొన్ని భూములకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం కానివి, అసలు దరఖాస్తు చేసుకోవడానికే ధరణిలో అవకాశం లేనివి ఉన్నాయి. 

సర్వే రిపోర్టు ఇచ్చినా.. 
నాకు సర్వే నంబర్‌ 680లో ఎస్సారెస్పీ కాలువ పోగా.. ఇంకా 2.39 ఎకరాల భూమి ఉంది. ఏడాది తర్వాత ఎస్సారెస్పీ కాలు వ కింద 1.10 ఎకరాల భూమి పోయిందంటూ ఆన్‌లైన్‌లో తొలగించారు. నేను తహసీల్దార్‌ దగ్గరికి వెళ్లగా సర్వే చేయించి రిపోర్టు ఇవ్వాలని సూచించారు. సర్వే చేయించి రిపోర్టు ఇచ్చినా ఇప్పటికీ మొత్తం భూమిని ఆన్‌లైన్‌లో చూపించడం లేదు.     
– కొండ నర్సయ్య, రైతు, వెంపటి 

ధరణితో మేలు జరగలేదు 
నాకు వెంపటి గ్రామ శివారులోని 217 సర్వే నంబర్‌లో 1.38 ఎకరాల భూమి ఉండగా 1.10 ఎకరం మాత్రమే పట్టా అయింది. అలాగే సర్వే నం.1,014లో 3 ఎకరాల భూమి ఉండగా.. కాలువకు అరె కరం భూమి పోయింది. 2.20 ఎకరాల భూమికి పట్టా రావాల్సి ఉండగా ఎకరానికే పట్టా పుస్తకం వచ్చిం ది. మిగతా భూమికి రైతుబంధు పడటం లేదు. ధరణి వచ్చినా నాకు మేలు జరగలేదు.     
– గుండగాని మల్లయ్య, రైతు, వెంపటి 

కొత్త పట్టా పుస్తకం ఇవ్వడం లేదు 
నాకు 25 గుంటల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి 2008లో పట్టా పొందాను. ధరణి వచ్చిన తర్వాత కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకానికి దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ ఇవ్వలేదు. రెవెన్యూ అధికారులను అడిగితే సర్వే చేయించుకోవాలని చెప్పారు. సర్వే చేసిన తర్వాత 2020 నవంబర్‌లో దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటికీ కొత్త పట్టాపాస్‌ బుక్‌ రాలేదు.     
– పుల్లూరి వెంకటేష్, రైతు, వెంపటి.  

రెవెన్యూ వలంటీర్‌ వ్యవస్థ అవసరం
‘‘గ్రామ స్థాయిలోనే భూపరిపాలన, భూములు, వాటి సమస్యల మీద అవగాహన ఉన్న యంత్రాం గాన్ని ఉంచడం, ఇంతకుముందు ఉన్నట్టు పారా లీగల్‌ లేదా కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌ లేదా వలంటీర్ల వ్యవస్థ ఉండటం అవసరం. వీలైనంత త్వరగా భూముల సర్వే చేయాలి. సర్వే చేస్తే తప్ప చాలా సమస్యలు పరిష్కారం కావు. ధరణిలో తప్పొప్పులను సవరించడానికి గ్రామ స్థాయిలోనే శిబిరాలు నిర్వహించి ఏవైనా సమస్యలు వస్తే అక్కడికక్కడే పరిష్కరించాలి’’     
– ల్యాండ్‌ సునీల్, భూ చట్టాల నిపుణుడు 

అవగాహన లోపాలతోనే.. 
‘‘అసలు భూసమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదనే మూలాల్లోకి వెళ్లి చూస్తే.. చాలా మందికి అవగాహన లోపం ఉందని తెలుస్తుంది. భూమి హక్కులు సరిగ్గా ఉన్నాయా లేదా, సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలనేది తెలియడం లేదు. రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరగాలి. రైతులకు ఏయే భూసమస్యలు ఉన్నాయో గుర్తించి గ్రామస్థాయిలోనే పరిష్కరించాలి. లీఫ్స్‌ ఆధ్వర్యంలో ప్రతి శనివారం భూ న్యాయ సహాయ శిబిరాలను రాష్ట్రమంతటా నిర్వహిస్తాం’’ 
– వి.లచ్చిరెడ్డి, ఫౌండర్‌ ప్రెసిడెంట్, తెలంగాణ తహసీల్దార్ల సంఘం 

మరిన్ని వార్తలు