తెలంగాణలో ఇదే తొలిసారి

25 Mar, 2021 03:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యగా విద్యాసంస్థలు మూసివేసిన సర్కారు మరోవైపు రోజూ నిర్వహించే కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచింది. సోమవారం 68,171 , మంగళవారం రికార్డు స్థాయిలో 70,280 పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రంలో ఇంత భారీ సంఖ్యలో టెస్టులు నిర్వహించడం ఇదే తొలిసారి. మరోవైపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ముమ్మరంగా కొనసాగిస్తోంది. కాగా, మంగళవారం 431 మందికి కరోనా సోకిందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు బుధవారం నాటి బులెటిన్‌లో వెల్లడించారు.

తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 111 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 97,89,113 కోవిడ్‌ పరీక్షలు జరిగాయి. వీటిల్లో మొత్తం 3,04,298 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజులో 228 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2,99,270 మంది బాధితులు కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1,676కు చేరింది. ఇక రికవరీ రేటు 98.34 శాతానికి తగ్గగా మరణాల రేటు 0.55 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసులు 3,352 ఉండగా, అందులో ఇళ్లు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల ఐసోలేషన్‌లో 1,395 మంది కరోనా బాధితులు ఉన్నారని శ్రీనివాసరావు తెలిపారు.

మొత్తం 10 లక్షలకు పైగా టీకాలు 
రాష్ట్రంలో ప్రస్తుతం 60 ఏళ్లు పైబడినవారికి, 45 నుంచి 59 ఏళ్ల వయస్సులోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకాలు వేస్తున్నారు. మంగళవారం నాటికి 60 ఏళ్లు పైబడిన 3,10,728 మంది టీకా వేయించుకున్నారు. 45–59 ఏళ్ల వయస్సు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 1,47,718 మంది టీకా పొందారు. జనవరి 16  నుంచి ఇప్పటివరకు మొదటి డోస్‌ తీసుకున్నవారు 7,86,426 మంది కాగా, 2,24,374 మంది రెండో డోస్‌ తీసుకున్నారు. మొత్తం మొదటి, రెండో డోస్‌ టీకాల సంఖ్య 10,10,800కు చేరింది. మంగళవారం ఒక్క రోజులో 60 ఏళ్లు పైబడిన 20,198 మందికి మొదటి డోస్‌ టీకా వేయగా, 45–59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో 15,026 మందికి టీకా వేశారు.   

మరిన్ని వార్తలు