Telangana: ఆ ‘ట్రిపుల్‌’తోనే ట్రబుల్‌

24 Jan, 2022 01:20 IST|Sakshi

మున్సిపల్, రెవెన్యూ, పోలీస్‌ విభాగాలపై ప్రజల ఫిర్యాదుల వెల్లువ

112 మంది అధికారులపై చర్యలకు విజిలెన్స్‌ కమిషన్‌ ఆదేశం

14 మందిపై విచారణకు తాఖీదులు

సెప్టెంబర్‌ త్రైమాసిక నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఆ మూడు విభాగాలు ప్రజలకు అత్యవసరమైన విభాగాలు. వాటితో నిత్యం ఏదో ఒక పని ఉంటుంది. అయితే, ఆ విభాగాలపై ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి నేరుగా రావడంతోపాటు, ఏసీబీ, విజిలెన్స్‌... ఇలా పలు వ్యవస్థల ద్వారా అందుతూనే ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రతి నెలా నమోదు చేసే కేసుల్లోనూ ఈ శాఖలవే ఎక్కువ ఉండటం ఆందోళన రేపుతోంది. ఆ మూడు శాఖలు ఏంటంటే.. మున్సిపల్‌–అర్బన్‌ డెవలప్‌ మెంట్, పోలీస్, రెవెన్యూ, అవినీతి నియంత్రణలో భాగంగా ఎప్పటికప్పుడు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ నుంచి నివేదిక తెప్పించుకొని చర్యలకు సిఫారసు చేసే రాష్ట్ర విజిలెన్స్‌ కమిషన్‌కు ఈ విభాగాలపైనే ఫిర్యాదులు ఎక్కువ రావడం ఆందోళన రేపుతోంది. ఆయా శాఖల్లో ఎంత మందిపై ఫిర్యాదులు వచ్చాయి, ఎంతమందిపై చర్యలకు సిఫారసు చేశారన్న అంశాలను విజిలెన్స్‌ కమిషన్‌ త్రైమాసిక నివేదికలో వివరించింది. 

విభాగాల వారీగా...: రాష్ట్ర విజిలెన్స్‌ కమిషన్‌కు ప్రభుత్వంలోని ప్రతీ విభాగం నుంచి అవినీతి, శాఖాపరమైన తప్పులు చేసిన వారిపై చర్యల నిమిత్తం కేసులు వస్తుంటాయి. అందులోభాగంగా గత జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి 175 ఫైళ్లు వచ్చినట్టు విజిలెన్స్‌ తన నివేదికలో పేర్కొంది. అంతకుముందు త్రైమాసికానికి సంబంధించి మరో 62 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయంది. మొత్తం కేసుల్లో మున్సిపల్‌ శాఖవి 43, హోంశాఖ 38, రెవెన్యూ 27, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖవి 22 ఉన్నాయి. ఆ తర్వాత ఇరిగేషన్, రోడ్డు రవాణా శాఖలకు సంబంధించి ఫిర్యాదులున్నాయి. వీటిలో లంచం తీసుకుంటూ పట్టుబడినవి, ఆదాయానికి మించిన ఆస్తుల కూడబెట్టినవి, అధికార దుర్వినియోగం చేసిన కేసులున్నాయి. 

విజిలెన్స్‌ కమిషన్‌కు ఫిర్యాదుల్లో...
రాష్ట్రంలో ఏసీబీ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలకు కాకుండా నేరుగా విజిలెన్స్‌ కమిషన్‌కే నేరుగా ఫిర్యాదులు రావడం సహజం. అయితే ఇలా గత త్రైమాసికంలో మొత్తంగా 126 ఫిర్యాదులు 24 విభాగాలకు సంబంధించిన అధికారులపై వచ్చాయి. అందులో అత్యధికంగా 36 మున్సిపల్‌ శాఖవారిపైనే రావడం సంచలనం రేపుతోంది. ఆ తర్వాత రెవెన్యూలో 30 ఫిర్యాదులు రాగా, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్‌లోని అధికారులపై 10, హోం శాఖపై 8 ఫిర్యాదులు అందినట్టు విజిలెన్స్‌ నివేదికలో వెల్లడించింది. వీటిలో 112 ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయగా, మిగిలిన 14 మందిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత విభాగాలను కమిషన్‌ ఆదేశించింది. మున్సిపల్‌ విభాగంలో ముగ్గురు గెజిటెడ్‌ అధికారులను, అటవీ శాఖలో ఒక గెజిటెడ్‌ అధికారి, ఒక నాన్‌ గెజిటెడ్‌ అధికారిని, రెవెన్యూలో ఒక నాన్‌ గెజిటెడ్‌ అధికారిని సస్పెండ్‌ చేసినట్టు నివేదికలో పొందుపరిచారు.

32 మందిపై ప్రాసిక్యూషన్‌...
32 మంది అధికారులపై ప్రాసిక్యూషన్‌కు ఏసీబీ, ఇతర దర్యాప్తు విభాగాలు పంపిన ప్రతిపాదనలకు విజిలెన్స్‌ కమిషన్‌ అనుమతిచ్చింది. అందులో రెవెన్యూ అధికారులు ఆరుగురు ఉండగా, హోంశాఖ నుంచి నలుగురు, న్యాయశాఖలో ముగ్గురు, పీఆర్‌ విభాగంలో ముగ్గురున్నారు. ఇకపోతే శాఖాపరమైన విచారణలో 158 మందిపై సంబంధిత విభాగాల్లోని ఉన్నతాధికారులను చర్యలు తీసుకునే అధికారిగా నియమించింది. ఇలా 158 మంది అవినీతి అధికారులపై చర్యలకు సిఫారసు చేసిన జాబితాలో 69 మంది అధికారులతో మున్సిపల్‌ శాఖ మొదటి స్థానంలో ఉండగా, 49 మందితో రెవెన్యూ రెండో స్థానంలో ఉంది. ఇరిగేషన్‌లో 9 మంది, రెవెన్యూ (పీఅండ్‌ఈ)లో ఐదుగురు, హోం శాఖలో ముగ్గురు, అటవీ శాఖలో ఐదుగురు ఇలా ఇతర విభాగాల్లో మిగిలిన అధికారులపై క్రమశిక్షణ చర్యలకు విజిలెన్స్‌ కమిషన్‌ సిఫారసు చేసింది. 12 విభాగాల్లో 82 మందిపై మైనర్, మేజర్‌ పెనాల్టీ కింద చర్యలకు సిఫారసు చేసినట్టు కమిషన్‌ నివేదికలో వెల్లడించింది. 
 

మరిన్ని వార్తలు