ఐదు గంటలు.. హైరిస్క్‌ ఆపరేషన్‌: 16 మంది సురక్షితం

24 Jul, 2021 08:35 IST|Sakshi
మంథని గౌతమేశ్వర ఆలయం వద్ద వరదలో చిక్కుకున్న బాధితులు

వరదలో చిక్కుకున్న 31 మంది

మంథని గౌతమేశ్వర ఆలయాన్ని చుట్టుముట్టిన గోదావరి

16 మందిని కాపాడిన సింగరేణి రెస్క్యూ టీం

సురక్షిత ప్రాంతానికి రావడానికి నిరాకరించిన మరో 15 మంది

మంథని: ఓ వైపు గోదావరి ఉగ్ర రూపం.. ఇంటి పెద్ద చనిపోవడంతో ఆలయ నిద్ర కోసం వచ్చిన కొందరు.. పడవలు కొట్టుకుపోకుండా ఒడ్డుకు చేర్చేందుకు వచ్చిన జాలర్లు మరికొందరు.. కాసేపటికే ఒక్కసారిగా పెరిగిన వరద.. ఎటు చూసినా నీళ్లే.. ప్రాణాలు అరచేత పట్టుకుని రాత్రంతా గడిపారు.. పొద్దున్నే వారిని రక్షించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. ఏమవుతుందోననే ఆందోళన పెరిగి పోయింది. ఐదు గంటలు కష్టపడ్డ అధికారులు చివరికి వారిని ఒడ్డుకు చేర్చారు. పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో గోదావరి ఒడ్డున ఉన్న గౌతమేశ్వర ఆలయం వద్ద జరిగిన ఘటన ఇది.

ప్రమాదకర పరిస్థితుల్లో..
మంథని మండలం కాకర్లపల్లికి చెందిన బొపెల్లి శంకరమ్మ భర్త ఈ నెల 12న చనిపోయాడు. పెద్దకర్మ అనంతరం ఆలయం వద్ద నిద్ర చేసేందుకని.. ఆమె తన ఇద్దరు కూతుళ్లు, మరో నలుగురితో కలిసి గురువారం రాత్రి 11 గంటలకు గౌతమేశ్వర ఆలయానికి వచ్చారు. అర్ధరాత్రి సమ యానికి వరద పెరిగిపోవడంతో అక్కడే చిక్కుకు పోయారు. ఒడ్డుకు చేర్చేందుకు వచ్చిన విలోచవరం గ్రామ జాలర్లు 9 మంది.. ఆలయం సమీపంలో నివాసం ఉండే రెండు కుటుంబాలకు చెందిన 15 మంది కూడా వరదలో ఉండిపోయారు. మంథని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆలయం వద్దకు చేరుకున్నారు. 

తాళ్లతో బాధితులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా సఫలం కాలేదు. సింగరేణి రెస్క్యూ టీం 9:30కు అక్కడికి చేరుకుని ట్యూబ్‌ల సాయంతో రక్షించేందుకు ప్రయత్నించింది. కానీ ప్రవాహం వేగంగా ఉండటంతో 50 మీటర్లు ముందుకెళ్లగానే.. ట్యూబ్‌లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడి, వెనక్కి వచ్చేశారు. చివరకు బోట్‌ తెప్పించి కాకర్లపల్లికి చెందిన ఏడుగురిని, తర్వాత 9 మంది జాలర్లను ఒడ్డుకు చేర్చారు. ఆలయం సమీపంలో ఉండే 15 మంది బయటికి రావడానికి నిరాకరించారు.

                   వరదలో చిక్కుకున్న వారిని కాపాడటానికి వచ్చిన సింగరేణి రెస్క్యూ టీం

పుస్తకాల కోసం వచ్చి..
వాంకిడి (ఆసిఫాబాద్‌): కుమ్రంభీం ఆసిఫా బాద్‌ జిల్లా వాంకిడి మండలం కనర్‌గాం, భీంపూర్‌ గ్రామాలకు చెందిన 20 మంది పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 17 మంది పాఠ్యపుస్తకాలు తీసుకొనేందుకు గురువారం వాంకిడిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలకు వచ్చా రు. పుస్తకాలు తీసుకుని మూడు ఆటోల్లో తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే దుబ్బగూడ గ్రామశివార్లలో రెండు వాగుల్లో ప్రవాహం పెరి గింది. కష్టం మీద ఒక వాగును దాటారు.

మరో వాగు వద్దకు వెళ్లేసరికే వరద ఉధృతి ఎక్కువై.. అక్కడే ఆగిపోయారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ అందని పరిస్థితి. రాత్రి 12 గంటల సమయంలో ఓ ఆటోడ్రైవర్‌కు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ అందడంతో.. కమానా గ్రామ ఎంపీటీసీకి ఫోన్‌ చేసి చెప్పాడు. చివరకు పోలీసులు రాత్రి 2 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
 

మరిన్ని వార్తలు