గూడు చెదిరింది... గోడు మిగిలింది!

20 Jul, 2022 01:20 IST|Sakshi

వరదలతో సర్వం కోల్పోయిన బాధితులు

పక్కాఇళ్లు లేని వారికి శిబిరాలే దిక్కు

డాబా ఇళ్లున్నా తప్పని వరద ఇక్కట్లు

లోతట్టు ప్రాంతాల్లో నివసించేందుకు జంకుతున్న జనం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వరద, ఒండ్రు పేరుకుపోయిన ఇళ్లు.. కూలేందుకు సిద్ధంగా ఉన్న మట్టిగోడలు.. నామరూపాల్లేకుండా పోయిన పూరి­పా­కలు.. మాస్కులు ధరించి సామాన్లు శుభ్రం చేస్తున్న మహిళలు.. పుస్తకాలు ఆరబెట్టుకుంటున్న పిల్లలు.. గోదావరి వరద తాకిడికి గురైన భద్రాచ­లం, పరిసర మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి.

భద్రాచలం పట్టణంలోని పలు కాలనీవాసులు ఇంకా సహాయక కేంద్రాల్లోనే గడు­పుతున్నారు. భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న స్లూయిస్‌ల ద్వారా లీకవుతున్న నీరు శిల్పినగర్, విస్తా కాంప్లెక్స్‌తోపాటు ఆలయ ఉత్తర ద్వారం వైపునకు వస్తోంది. ఇరిగేషన్‌ శాఖ ఏర్పాటు చేసిన ఐదు మోటార్లకు అదనంగా సింగరేణి నుంచి మోటార్లు తెప్పించారు. ప్రస్తుతం 15 మోటార్లు బిగించి వరదనీటిని తోడి తిరిగి గోదావరిలోకి ఎత్తిపోస్తున్నారు.

విద్యుత్‌ శాఖకు భారీ నష్టం..: ఏడు మండలాల్లో 630కి పైగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, పర్ణశాల సబ్‌స్టేషన్‌ వరద నీటిలో చిక్కుకున్నాయి. రూ.16 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. ఇక 143 గ్రామాల్లో 5,620 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. భద్రా­చలం– చర్ల దారిలో వారం రోజులుగా రాకపోకలు ఆగిపోయాయి. మూడు రోజులుగా హెలికాప్టర్‌ ద్వారానే సహాయ శిబిరాలకు నిత్యావసర వస్తువు­లు తరలిస్తున్నారు. ఒండ్రు, వ్యర్థాల తొలగింపు పనుల్లో 4,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది నిమగ్న­మయ్యారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. 

ఈ చిత్రంలో సామాన్లు మోస్తున్న రాజేశ్‌కు భద్రాచలంలోని సుభాష్‌నగర్‌ కాలనీలో సొంత డాబా ఇల్లు ఉంది. హఠాత్తుగా వరద కమ్ముకొచ్చేయడంతో అప్పటికప్పుడు ఇంట్లోని సామాన్లన్నీ వదిలేసి కట్టుబట్టలతో సహాయక శిబిరానికి కుటుంబంతో కలసి వెళ్లాడు. ఇల్లు నీటమునిగి విలువైన సామగ్రి తడిచి పాడైపోయింది. వరద తగ్గినా మళ్లీ ముంపు తప్పదనే భయం వెంటాడుతుండటంతో సొంత ఇంటికి కాకుండా మరోచోట అద్దె ఇంటికి వెళ్తున్నాడు. 

ఇక్కడ తడిసిన బియ్యాన్ని చూపిస్తున్న వ్యక్తి పేరు కౌలూరి లక్ష్మణ్‌. దినసరి కూలీ. వేసవిలో పనులు బాగా దొరకడంతో తిండికి ఇబ్బంది రావొద్దని ఒకేసారి రెండు క్వింటాళ్ల బియ్యం కొనిపెట్టుకు న్నాడు. తర్వాత రెండ్రోజులకే విరుచుకుపడిన వరదల్లో బియ్యం, ఇతర నిత్యవసరాలు తడిసి ముద్దయ్యాయి. పూరిపాక గోడలు నాని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వరదలు తగ్గాక ప్రభుత్వం కొత్త ఇల్లు కట్టించి ఇచ్చే వరకు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక శిబిరంలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు.

నేలమట్టమైన ఈ గుడిసె వృద్ధుడైన పుల్లయ్యది. పిల్లలకు పెళ్లి చేశాక ఈ పూరి గుడిసెలోనే ఆ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవలి వరదలకు గుడిసెతోపాటు మట్టిగోడలు పడిపోవడంతో దిక్కు తోచని స్థితిలో పునరావాస శిబిరంలోనే ఉంటున్నారు. మళ్లీ గుడిసెను ఏర్పాటు చేసుకొనే స్థోమత ఆయనకు లేదు. వరద సహాయక శిబిరాలు కొనసాగినన్ని రోజులు అదే వారిల్లు. కానీ, వరద తగ్గిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కు తోచనిస్థితిలో ఉన్నారీ పండుటాకులు. 

పునరావాస శిబిరంలోనే ఉంటాం
కేసీఆర్‌ సార్‌ చెప్పి­నట్లు ఆగస్టు 1 వరకు జూని­యర్‌ కళాశాల పునరా­వాస శిబిరంలోనే ఉంటాం. ఇక్కడ అన్ని వసతులు­న్నా­యి. ఇండ్లకు వెళ్లి ఆ చీకట్లో పాములు, క్రిమి కీటకాలతో భయం భయంగా ఉండటం కంటే ఇక్కడ ఉండటమే నయం. 
– ఎస్‌కే యాకూబీ, సుభాష్‌నగర్, భద్రాచలం 

మరిన్ని వార్తలు