ఇళ్లున్నా ఆక్రమణలు: అటవీశాఖ 

12 Jul, 2022 01:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోయపోచగూడలో పోడు భూములు లేవని, గతంలో ఎప్పుడూ అక్కడి వారు పోడు వ్యవసాయం చేసిన దాఖలాలు లేవని అటవీశాఖ స్పష్టంచేసింది. కోయపోచగూడకు ఆనుకుని ఉన్నదంతా కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌కు చెందిన అటవీభూమి మాత్రమేనని, అటవీ, రెవెన్యూ రికార్డుల్లో పోడు భూమే లేదని వెల్లడించింది. గ్రామంలో ఇళ్లు, భూములున్నా కూడా, అటవీభూమిని ఆక్రమించాలనే దురుద్దేశంతోనే కోయపోచగూడలో కొందరు రాద్దాంతం చేస్తున్నారని మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివాని డోగ్రా ఒక ప్రకటనలో తెలిపారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, మాకులపేట పంచాయతీ, కోయపోచగూడలో అటవీ భూములను ఆక్రమిస్తున్నారని, అడ్డుకున్న అధికారులపై దాడులకు పాల్పడుతూ అటవీశాఖ అధికారుల విధులను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. వాస్తవంగా వారికి మాకులపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఇళ్లు ఉన్నాయని, కొందరి ప్రోద్బలంతో ఫారెస్ట్‌ భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

అక్కడికి మహిళలని పంపించి, వారిని ముందు పెట్టి పోడు భూముల పేరుతో ఫారెస్ట్‌ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అది చట్టరీత్యా నేరమని స్పష్టంచేశారు. కోయపోచగూడ పరిధిలో పోడు భూములు లేవని చెప్పడానికి తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. పోడు భూముల్లో ఆక్రమణలకు పాల్పడ్డ వారు అధికారులకు సహకరిస్తే భవిష్యత్‌లో వారికి అక్కడ చేపట్టే ఫారెస్ట్‌ పనుల్లో ఉపాధి కల్పిస్తామని శివాని వెల్లడించారు.    

మరిన్ని వార్తలు