Telangana Formation Day: అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్‌ నివాళులు

2 Jun, 2021 14:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడకలు నిరాడంబరంగా జరిగాయి. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద  నివాళులు అర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్‌

రాజన్నసిరిసిల్ల: జిల్లాలో తెలంగాణ అవతరణ వేడుకలల్లో భాగంగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మంత్రి కేటీఆర్‌ నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు.

సిద్దిపేట దేవాలయాలు, ప్రాజెక్టులకు ఖిల్లా..
సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడకల్లో భాగంగా మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పాటు జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్‌ను జూన్ 2వ వారంలో ప్రారంభించుకున్నామని చెప్పారు. ఇవ్వాళ సిద్దిపేట జిల్లా.. దేవాలయాలు, ప్రాజెక్టులకు ఖిల్లాగా మారిందన్నారు. ఒకప్పుడు బీడులువారిన పొలాలు ఉండేవని కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా చెరువుల మత్తడి దుంకుతున్నాయని తెలిపారు. 

జిల్లాలో ఫారెస్ట్ కాలేజీ, మెడికల్ కాలేజీ, ఔటర్ రింగ్‌రోడ్డు, కేంద్రీయ విద్యాలయంతో అభివృద్ధి చెందిన జిల్లాగా మారిందని అన్నారు. 127 రైతు వేదికలు జిల్లాలో నిర్మించుకున్నామని, ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కూడా ఉండేది కాదు. కానీ, ఇప్పుడు విద్యుత్‌కు అంతరాయం లేకుండా ఉందని తెలిపారు. జిల్లాకు గోదావరి జలాలు రావడంతో మంచి పంటలు పండించుకొని ఎంతో రుచికరమైన ఆహారాన్ని ప్రజలు తీసుకొని రోగాల బారిన పడకుండా ఉంటున్నారని చెప్పారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టడం ఓ కళ అని ఎద్దేవా చేశారు. కానీ రానున్న నెల, రెండు నెలల్లో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుండి వచ్చే నీటిని రైతులకు అందిస్తామని తెలిపారు.
చదవండి: Telangana: సంక్షేమం.. ‘సప్త’పథం

మరిన్ని వార్తలు