నిరాడంబరంగా  రాష్ట్ర అవతరణ దినోత్సవం

3 Jun, 2021 04:06 IST|Sakshi
ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ జెండావందనం. చిత్రంలో సీఎస్‌ సోమేశ్, డీజీపీ మహేందర్‌రెడ్డి

ప్రగతిభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌ 

గన్‌పార్క్‌లో అమర వీరులకు నివాళి  

శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని 

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అంతకు ముందు ఆయన గన్‌పార్క్‌లోని తెలంగాణ అమర వీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. కోవిడ్‌–19 మహమ్మారి నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది తెలంగాణ అవతరణ దినోత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. ప్రగతిభవన్‌లో జరిగిన వేడుకల్లో సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్‌ ఎస్‌.మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లో జరిగిన ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.  

ఉజ్వల భవిష్యత్తు ఉండాలి: రాష్ట్రపతి 
తెలంగాణ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆకాంక్షించారు. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేయాలన్న జాతీయ లక్ష్యాన్ని ఇప్పటికే తెలంగాణ నెరవేర్చిందని  గుర్తు చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణ పురోగతి మరింతగా విస్తరించాలని కోరుకున్నారు. 

ఘనమైన చరిత్రకు నిలయం: ఉప రాష్ట్రపతి 
ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు తెలంగాణ నిలయమని ఉప రాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు. సహజ వనరులతో, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన పురోగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షించారు.  

తెలంగాణ ప్రజల కోసం ప్రార్థిస్తున్నా: ప్రధాని 
విభిన్న సంస్కృతులతో పాటు ఎన్నో రంగాల్లో విశేషంగా రాణించినటువంటిæ కష్టపడి పనిచేసే వ్యక్తులను కలిగి ఉండడం తెలంగాణకు వరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలి పారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తాను ప్రార్థిస్తున్నానన్నారు.  రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు