రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు తెచ్చింది గుండుసున్నా: వినోద్‌  

4 Oct, 2021 03:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఒక్క రూపాయి అదనపు నిధులు తీసుకురాలేకపోయారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ విమర్శించారు. రెండేళ్లలో కేంద్రం నుంచి బీజేపీ ఎంపీలు తెచ్చింది గుండుసున్నా అని ఎద్దేవాచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎంపీగా ఉండి తెలంగాణ కోసం పార్లమెంట్‌లో ఏమీ మాట్లాడలేదన్నారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో వినోద్‌ విలేకరుల భేటీలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం 150 మెడికల్‌ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని, బీజేపీ ఎంపీలు కూడా దీనిపై పోరాడిందేమీ లేదని అన్నారు. బీజేపీ ఎంపీలకు దమ్ముంటే టిమ్స్‌ ఆస్పత్రుల నిర్మాణం కోసం ఐదారు వేల కోట్ల నిధులు తీసుకురావాలని సవాల్‌ విసిరారు. ఎన్నికల కమిషన్‌ అనుమతిస్తే హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ సభలుంటాయని వినోద్‌ వెల్లడించారు.   

మరిన్ని వార్తలు