Telangana: అప్పులకు ‘ఆలంబన’

21 May, 2021 09:52 IST|Sakshi

రాష్ట్రాల రుణ పరిమితి 3 నుంచి 5 శాతానికి పెంపు

ఈ ఏడాది రూ. 60 వేల కోట్ల వరకు అప్పు తీసుకునే వెసులుబాటు

కరోనా కష్టకాలంలో రాష్ట్రాలకు ఊరట

ఓవర్‌ డ్రాఫ్ట్‌ 36 రోజుల నుంచి 50 రోజులకు పెంపు

వేతనాల చెల్లింపు లాంటి తక్షణావసరాలకు ఉపశమనం

సాక్షి, హైదరాబాద్‌: ద్రవ్య నియంత్రణ, బడ్జెట్‌ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం)లో రుణ పరిమితి పెంపు కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆలంబనగా నిలుస్తుందని తెలంగాణ ఆర్థిక శాఖ ఆశిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో 5 శాతం వరకు రుణం పొందొచ్చని వెసులుబాటు కలి్పంచింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దాదాపు రూ.60 వేల కోట్ల అప్పులు తీసుకోవచ్చని అంచనా వేస్తోంది.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.11.05 లక్షల కోట్ల వరకు ఉండొచ్చన్న అంచనా మేరకు అందులో 5 శాతం అంటే రూ.55 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు అప్పులు తీసుకునే అవకాశముందని లెక్కలు కడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో మొత్తం రూ.47,500 కోట్లను బహిరంగ మార్కెట్‌ రుణాల ద్వారా సమీకరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు అదనంగా మరో రూ.7,500 నుంచి రూ.12,500 కోట్ల వరకు తీసుకునే వెసులుబాటు కలగనుందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఓవర్‌ డ్రాఫ్ట్‌ లోనూ ఊరట..
ప్రతి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ)కు వెళ్లేందుకు 36 రోజుల సమయం అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఓడీని ఆర్బీఐ సవరించింది. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 3 నెలల కాలంలో 50 రోజుల పాటు ఓడీకి వెళ్లొచ్చు. అలాగే గతంలో వరుసగా 14 రోజులు మాత్రమే ఓడీకి వెళ్లే వీలుండగా, ఇప్పుడు అది 21 రోజులకు పొడిగించింది. ఈ వెసులుబాటు అన్ని రాష్ట్రాలకు సెప్టెంబర్‌ 30 వరకు వర్తించనుంది. దీంతో కష్టకాలంలో ఓడీలు ఉపయోగపడతాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. ముఖ్యంగా వేతనాలు, వడ్డీల చెల్లింపు లాంటి తక్షణావసరాలకు ఈ వెసులుబాటు ఉపయోగపడుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం తగ్గిన నేపథ్యంలో నిధుల సమీకరణ ఎలా అన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే మొదటి త్రైమాసికానికి గాను బాండ్ల అమ్మకాల ద్వారా రూ.9 వేల కోట్ల సమీకరణకు ప్రణాళిక రూపొందించుకోగా, మిగిలిన నిధులు ఎక్కడి నుంచి తేవాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇందుకు సంబంధించిన లెక్కలు ఈ నెలాఖరుకు తేలుతాయని, మేలో ఆదాయ, వ్యయ అంచనాల ఆధారంగా, వచ్చే త్రైమాసికానికి కూడా నిధుల సమీకరణ ప్రణాళిక రూపొందిస్తామని చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు