నీటి పంపకాలపై కదలిక

17 Aug, 2021 02:25 IST|Sakshi

27న పూర్తిస్థాయి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ

ఈ ఏడాది నీటి కేటాయింపులు, వినియోగంపై చర్చ

రెండు రాష్ట్రాల అభ్యంతరాలు, డిమాండ్లపై కూడా.. అజెండాలో మొత్తం 13 కీలక అంశాలు

సాక్షి, హైదరాబాద్‌: నదీ జలాల పంపకంపై రెండు తెలుగు రాష్ట్రాలతో పూర్తిస్థాయి చర్చలు జరిపేందుకు కృష్ణా బోర్డు సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ నెల 27న పూర్తి స్థాయి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు లేఖలు రాసింది. మొత్తం 13 కీలక అంశాలను సమావేశం అజెండాలో చేర్చింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో జలాల పంపిణీ, క్యారీ ఓవర్, వరద జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ, కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌ల సమర్పణ, అనుమతులు, విద్యుత్‌ వినియోగం, చిన్న నీటి వనరుల కింద వినియోగం, బడ్జెట్, సిబ్బంది కేటా యింపులు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. 

చెరిసగం వాటాలు చేయాలంటున్న తెలంగాణ
సాధారణంగా ప్రతి ఏటా జూన్‌లో నీటి సంవ త్సరం ఆరంభానికి ముందే బోర్డు భేటీ నిర్వహి స్తారు. నీటి వాటాలు, కేటాయింపులు, అంతకు ముందు వినియోగం తదితర లెక్కలు తేలుస్తారు. కానీ ఈ ఏడాది ఆ ప్రక్రియ ఇంతవరకు జరగలేదు. మే 25న భేటీ నిర్వహిస్తామని చెప్పినప్పటికీ, ఆరోజు ఇతర కార్యక్రమాలున్నాయని ఏపీ చెప్పడంతో సమావేశం జరగలేదు. ఆ తర్వాత కొత్త చైర్మన్‌ రాకలో ఆలస్యంతో భేటీ కాలేదు. అనంతరం భేటీ అయినా కేంద్రం గెజిట్‌ విడుదల, దాని అమలుపై చర్చల నేపథ్యంలో నీటి వినియోగం, పంపకాలపై చర్చ జరగలేదు.

అదీగాక ఈ ఏడాది ఆగస్టు తొలి వారానికే ప్రాజెక్టులన్నీ నిండటంతో ఆయా అంశాలకు సంబంధించి పెద్దగా సమస్యలు రాలేదు. అయితే ఇటీవల తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల కింద చేస్తున్న వినియోగంపై ఏపీ ఫిర్యాదులు చేస్తోంది. మరోవైపు ఈ ఏడాది నుంచి కృష్ణా జలాల్లో యాభై శాతం వాటా ఇవ్వాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. ఏపీ, తెలంగాణలకు తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో కొనసాగుతూ వస్తున్న కృష్ణా జలాల పంపిణీని ఈ ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని చెబుతోంది. ఈ నేపథ్యంలో జరగనున్న పూర్తిస్థాయి భేటీలో ఈ అంశం పైనే ప్రధానంగా చర్చ జరగనుంది.

క్యారీఓవర్, వరద, మళ్లింపు జలాలపైనా చర్చ
ఇక మళ్లింపు జలాల్లో వాటా, క్యారీఓవర్, వరద జలాల వినియోగంపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. 2019–20 నీటి సంవత్సరంలో కేటాయించిన నీటిలో 50.851 టీఎంసీలను తాము వాడుకోలేకపోయామని.. వాటిని 2020– 21లో వినియోగించుకుంటామని గతేడాది తెలం గాణ సర్కార్‌ కృష్ణా బోర్డును కోరింది. దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. కాగా బేసిన్‌లోని ప్రాజె క్టులన్నీ నిండి నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు వరద జలాలను ఎవరు వాడుకున్నా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ కోరుతోంది.

అయితే దీనిపై తెలంగాణ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. బోర్డు భేటీలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం.. పోలవరానికి కేంద్ర జల సంఘం అనుమతులు వచ్చిన వెంటనే కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల వాటాను కేటాయించాలని గట్టిగా కోరుతోంది. దీంతో పాటే ఏపీ అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలు, ఆర్డీఎస్‌ కుడి కాల్వ పనులను తక్షణమే ఆపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా అదనంగా వేరే బేసిన్‌కు, ఇతర ప్రాజెక్టులకు నీటిని తరలించ డంపై చర్యలు తీసుకోవాలని కూడా కోరుతోంది. దీనిపై ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ అంశాలన్నిటిపైనా 27న జరిగే భేటీలో వాదనలు జరిగే అవకాశాలున్నాయి. 

మరిన్ని వార్తలు