అంగన్‌వాడీలపై ‘గ్యాస్‌’ బండ! 

23 May, 2022 01:22 IST|Sakshi

ఏడాదికిపైగా పేరుకుపోయిన సిలిండర్‌ బిల్లులు 

రూ.10కోట్లకు పైగా నిలిచిన చెల్లింపులు 

చాలాచోట్ల వ్యక్తిగతంగా బిల్లులు చెల్లించి కొంటున్న వైనం  

బకాయిలు చెల్లించాలంటున్న అంగన్‌వాడీ టీచర్లు 

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీల్లో పౌష్టికాహార పంపిణీ నిర్వాహకులకు గ్యాస్‌బండ గుదిబండలా మారింది. ఒకవైపు వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర అమాంతం పెరుగుతుండగా.. మరోవైపు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన గ్యాస్‌ బిల్లులు సకాలంలో రాకపోవడం అంగన్‌వాడీ టీచర్లకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఏడాది కాలంగా రూ.10కోట్లకుపైగా గ్యాస్‌ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

కొన్ని జిల్లాల్లో అడపాదడపా చెల్లింపులు చేస్తున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంత జిల్లాల్లో మాత్రం పెండింగ్‌లో ఉ న్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై జిల్లా సంక్షేమాధికారుల (డీడబ్ల్యూఓ)కు వినతులు ఇస్తున్నప్పటికీ  నిధులు విడుదల కాగానే చెల్లింపులు చేస్తామని చెప్పి చేతులు దులుపుకొంటున్నారు. 

రోజూ పోషకాహారం: రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ (సమ గ్ర శిశు అభివృద్ధి సర్వీసు) ప్రాజెక్టులున్నాయి. ఇందులో 99 ఐసీడీఎస్‌లు గ్రామీణ ప్రాంతాల్లో, 25 పట్టణ ప్రాంతా ల్లో, మరో 25 ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. అన్ని ఐసీడీఎస్‌ల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, ఇందులో 31,711 ప్రధాన, 3,989 మినీ అంగన్‌వాడీ కేం ద్రాలు. అన్ని కేంద్రాల్లో 4.57 లక్షల గర్భిణులు/బాలిం తలు, మూడేళ్లలోపు చిన్నారులు 10.34 లక్షలు, 3–6 ఏళ్లలోపు చిన్నారులు 6.67 లక్షల మంది నమోదయ్యారు.

చిన్నారులకు ప్రీస్కూల్‌ సర్వీసులతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తుండగా.. గర్భిణులు, బాలింతలకు రోజూ అన్ని రకాల పోషకాలున్న వేడివేడి భోజనాన్ని అందిస్తున్నారు. ఈ భోజనాన్ని వండేందుకు అంగన్‌వాడీ కేంద్రాలకు గ్యాస్‌ సిలిండర్, పొయ్యిలను ప్రభుత్వం ఇచ్చింది. వీటిని ఉపయోగించి రోజువారీగా పోషకాహారాన్ని అం దించే బాధ్యతను అంగన్‌వాడీ టీచర్లకు అప్పగించింది.

రెండు నెలలకో సిలిండర్‌ 
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని వడ్డించి పంపిణీ చేయడంలో గ్రామీణ కేంద్రాలే ముందు వరుసలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోని ఎక్కువ శాతం కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని సరుకుల రూపంలో లబ్ధిదారులకు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వంట చేసి అప్పటికప్పుడు వడ్డిస్తున్నారు. సగటున రెండు నెలలకో సిలిండర్‌ను వినియోగిస్తున్నట్లు సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ అంగన్‌వాడీ టీచర్‌ చెప్పారు. పలు గ్రామీణ జిల్లాల్లో బిల్లులు రాకపోవడంతో టీచర్లు వ్యక్తిగతంగా డబ్బులు చెల్లించి సిలిండర్లు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.1,052గా ఉండగా, డెలివరీ చార్జీల కింద డీలర్లు మరో రూ.50 వసూలు చేస్తున్నారు. దీంతో సిలిండర్‌ ధర రూ.1,102గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల కేంద్రాలకు ఏడాదిగా గ్యాస్‌ బిల్లులు విడుదల కాలేదని టీచర్లు చెబుతున్నారు. ఈ బకాయిలు రూ.10 కోట్లకుపైగా ఉంటాయని అంచనా. వీటిని తక్షణమే విడుదల చేస్తేనే లబ్ధిదారులకు పౌష్టిక ఆహారాన్ని పంపిణీ చేస్తామని అంగన్‌వాడీలు అంటున్నారు.  

మరిన్ని వార్తలు