‘కృష్ణా’ గేట్లన్నీ ఓపెన్‌

2 Aug, 2021 02:36 IST|Sakshi

ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా ప్రాజెక్టులన్నీ ఫుల్‌

ఆగస్టు తొలివారంలోనే గేట్లెత్తడం 2009 తర్వాత ఇదే తొలిసారి

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

సాక్షి, హైదరాబాద్‌/నాగార్జునసాగర్‌/హుజూర్‌నగర్‌: ఎగువన ఆల్మట్టి నుంచి దిగువన పులిచింతల దాకా కృష్ణా నదిలో భారీ ప్రవాహం కొనసాగుతోంది. అన్ని ప్రధాన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆగస్టు తొలివారంలోనే అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం 2009 ఏడాది తర్వాత ఇదే తొలిసారికావడం విశేషం. కృష్ణా పరవళ్లతో బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. సాగర్‌ సహా అన్ని ప్రాజెక్టులు నిండటంతో తాగునీటి అవసరాలు తీరడంతోపాటు వానాకాలం, యాసంగి రెండు పంటలకు సాగునీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎగువన కుండపోత వానలతో..: మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలకు గత నెలలోనే ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులు నిండిపోయాయి. తర్వాత కూడా వానలు కొనసాగడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఆ నీళ్లన్నీ జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు కూడా నాలుగు రోజుల కిందటే నిండటంతో గేట్లు ఎత్తివేశారు. తాజాగా నాగార్జున సాగర్‌ సైతం నిండింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల

సమయానికి నీటి నిల్వ 297 టీఎంసీలు దాటింది. ఎగువ నుంచి 4.38 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతుండటంతో డ్యామ్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి సాగర్‌లో 206 టీఎంసీల నిల్వ మాత్రమే ఉండగా.. ఈసారి పూర్తిగా నిండింది. 2009 తర్వాతి నుంచి చూస్తే.. ఆగస్టు తొలివారంలోనే సాగర్‌ గేట్లు ఎత్తడం, మొత్తం కృష్ణా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఉంచడం ఇదే తొలిసారి అని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు.

2 పంటలకు ఢోకా లేనట్టే..
సాగర్‌ నిండుకుండలా మారడంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆదివారం నుంచే ఎడమ కాల్వ కింద సాగు అవసరాలకు నీటి విడుదల మొదలైంది. ప్రాజెక్టు ఇప్పటికే నిండటం, అక్టోబర్‌ వరకు కూడా ప్రవాహాలు వచ్చే అవకాశాలు ఉండటంతో ఈసారి వానాకాలం, యాసంగి పంటల సాగుకు ఇక్కట్లు తప్పనున్నాయి. ఈ ఏడాది వానాకాలంలో సాగర్‌ కింద 6.40 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక తయారైంది. అంటే సుమారు 60 టీఎంసీల నీటిని 6 నుంచి 7 తడుల్లో ఇవ్వనున్నారు. సాగర్‌పై ఆధారపడ్డ ఏఎమ్మార్పీ, హైదరాబాద్, మిషన్‌ భగీరథ, నల్లగొండ జిల్లా తాగు అవసరాలకు ఇబ్బంది తప్పనుంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు