పులికి, గద్దకు పురస్కారం! 

31 Aug, 2020 03:29 IST|Sakshi

వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీలో రాష్ట్రానికి రెండు అవార్డులు 

సాక్షి, హైదరాబాద్‌/జన్నారం: వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూసీఎస్‌) జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో తెలంగాణ అటవీశాఖకు రెండు అవార్డులు దక్కాయి. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ‘‘బెస్ట్‌ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫ్స్‌–2020’’పేరుతో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రానికి ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. ఆదిలాబాద్‌ ఫారెస్ట్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర రావు.. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని తిప్పేశ్వర్‌ అభయారణ్యంలో తీసిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ఫొటో రెండవ, జన్నారం డివిజనల్‌ అధికారి సిరిపురపు మాధవరావు.. కవ్వాల్‌ అభయారణ్యంలో తీసిన అరుదైన జాతి గద్ద ఫొటో(క్రెస్టెడ్‌ హాక్‌ ఈగల్‌) మూడవ స్థానంలో నిలిచాయి.

ప్రథమ అవార్డును అసోంలోని కజిరంగ నేషనల్‌ పార్క్‌లో ఆసియా జాతి ఏనుగు ఫొటో తీసిన అక్షదీప్‌ బారువా(చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్, లోయర్‌ అసోం జోన్‌) గెలుచుకున్నారు. నాలుగు, ఐదు అవార్డులు వరుసగా రాహుల్‌ సింగ్‌ సికర్వార్‌(ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌–మధ్యప్రదేశ్‌) తీసిన ఆసియా జాతి సింహం ఫొటో, అయాన్‌ పాల్‌(ఇన్‌స్పెక్టర్‌–కస్టమ్స్‌ డివిజన్, గువాహటి) తీసిన రెడ్‌ పాండా ఫొటోకు లభించాయి. కాగా, కవ్వాల్‌ పులుల అభయారణ్యంలోని జన్నారం అటవీ డివిజన్‌లో తీసిన వివిధరకాల వన్యప్రాణులు, పక్షుల ఫొటోలను డబ్ల్యూసీఎస్‌ ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు అభినందనలు తెలియజేయడం విశేషం. అవార్డులు సాధించిన రాష్ట్ర అధికారులను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.  

చాలా ఆనందంగా ఉంది..
కవ్వాల్‌ పులుల అభయారణ్యంలో ప్రధానంగా వన్యప్రాణుల సంరక్షణపై దృష్టి ఉండేది. నేను వచ్చిన తర్వాత ఇక్కడ వన్యప్రాణులతో పాటు పక్షుల సందడీ గమనించా. బర్డ్‌ ఫెస్టివల్‌ సందర్బంగా కొందరు నిపుణులు ఇక్కడికి వచ్చి అరుదైన ఫొటోలు తీశారు. వారిని చూసి మేము కూడా ఇక్కడి పక్షులు, వన్యప్రాణుల ఫొటోలు కొన్ని తీశాం. అందులో నేను తీసిన ఫొటో జాతీయ స్థాయిలో ఎంపికవడం ఆనందంగా ఉంది.  – మాధవరావు, ఎఫ్‌డీవో, జన్నారం

మరిన్ని వార్తలు