111 జీవో ఎత్తేస్తే నగరానికి ముప్పు

16 Apr, 2022 02:47 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న పీపుల్స్‌ కమిటీ ప్రతినిధులు

త్రిసభ్య కమిటీ ఆందోళన

సాక్షి,బంజారాహిల్స్‌: హైదరాబాద్‌ నగరానికి వరదల నివారణ కోసం నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలను కాపాడుకోకపోతే భవిష్యత్తులో భాగ్యనగరానికి ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరించారు. జలాశయాల పరిరక్షణకు తెచ్చిన 111 జీవోను ఎత్తేయడం వల్ల రాబోయే రోజుల్లో నగరానికి ముప్పు పొంచి ఉన్నట్లేనని అభిప్రాయపడ్డారు. 111 జీవో ఎత్తివేతపై శుక్రవారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో త్రిసభ్య పీపుల్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఐఐసీటీ హైదరాబాద్‌ రిటైర్డ్‌ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ బాబూరావు కలపాల, సుప్రీంకోర్టు కమిటీ సభ్యుడు సాగర్‌ దార, ఎన్‌జీఆర్‌ఐ రిటైర్డ్‌ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ బి. రామలింగేశ్వర్‌రావు, వాటర్‌ రిసోర్సెస్‌ కౌన్సిల్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ లుగ్నా సార్వత్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ బాబూరావు మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు మేలు చేకూర్చేందుకే 111 జీవో ఎత్తేశారనే విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. ఈ జీవో ఎత్తివేత వల్ల జంట జలాశయాలు హుస్సేన్‌సాగర్‌లాగా మారబోతున్నాయని చెప్పారు. మల్లన్న సాగర్‌ నుంచి పంప్‌ల ద్వారా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లకు నీళ్లు నింపుతామని చెబుతున్నారని.... అయితే ఈ నీటిని తీసుకొచ్చేందుకు ఎంత విద్యుత్‌ అవసరమవుతుందో తెలుసా అని ప్రశ్నించారు. 90 శాతం ఓపెన్‌ ఏరియాను కాపాడతామని ప్రభుత్వం చెబుతున్నదని... తీరా నిర్మాణాలు జరిగాక బీఆర్‌ఎస్‌ పేరుతో వాటిని రెగ్యులరైజ్‌ చేయడానికి ఏ మాత్రం వెనుకాడబోదని మరో హైదరాబాద్‌గా 111 జీవో ప్రాంతమంతా మారబోతున్నదని హెచ్చరించారు. వాతా వరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుందని.. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌కు ఈ ప్రమాదం పొంచి ఉందని సాగర్‌ ధార పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు