నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా...

8 Aug, 2020 04:55 IST|Sakshi

‘నేతన్నకు చేయూత’ కింద రూ.93 కోట్లు విడుదల చేశాం: కేటీఆర్‌

పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్కు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించాం

గద్వాల హ్యాండ్లూమ్‌ పార్కుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తాం..

18 మంది కళాకారులకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ చేనేత పురస్కారాలు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చేనేత రంగంలోని 40 వేల కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఒడిశాకు చెందిన అధికారుల బృందం రాష్ట్రం లోని చేనేత సంక్షేమ పథకాలను ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత, జౌళి శాఖల అధికారులు, కలెక్టర్లు, చేనేత కార్మికులతో శుక్రవారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ‘నేతన్నకు చేయూత’ పథకం కింద కరోనా సమయంలో రూ.93 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రూ.10.24 కోట్లతో పోచంపల్లి, ఆలేరు, కనుకుల, శాయంపేట, కమలాపూర్, ఆర్మూర్, వెల్టూర్, వేములవాడలో బ్లాక్‌ లెవల్‌ క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోచంపల్లి హ్యాం డ్లూమ్‌ పార్కు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించామని, గద్వాల చేనేత పార్కుకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు.

నేతన్నకు చేయూత కొనసాగింపు.. 
నేతన్నకు చేయూత పథకాన్ని కొనసాగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. నారాయణపేటలో చేనేత కళాకారుల కోసం కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ (సీఎఫ్‌సీ) నిర్మించేందుకు ఇప్పటికే స్థలం కేటాయించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఈ స్థలంలో సీఎఫ్‌సీతో పాటు సర్వీస్‌ సెంటర్‌ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశించారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర చేనేత అవార్డు గ్రహీతలకు ఇస్తున్న నగదు పురస్కారాన్ని రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన 18 మంది కళాకారులకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ చేనేత పురస్కారాలు అందజేశారు. వీరిలో ఇద్దరికి కేటీఆర్‌ చేతుల మీదుగా ఇవ్వగా, మరో 16 మందికి ఆయా జిల్లాల కలెక్టర్లు అందజేశారు. వర్చువల్‌ విధానంలో కేటీఆర్‌తో అవార్డు గ్రహీతలతో సంభాషించి ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత పథకాలపై అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. 

‘ఆలంబన’ ఆవిష్కరణ 
చేనేత జౌళి శాఖ రూపొందించిన ‘ఆలంబన యాప్‌’ను కేటీఆర్‌ ఆవిష్కరించారు. వర్చువల్‌ సమావేశంలో యూఎన్‌డీపీ డిప్యూటీ రెసిడెంట్‌ నదియా రషీద్, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, చేనేత జౌళి శాఖ సంచాలకులు శైలజా రామయ్యర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు