31లోగా వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తులు చేసుకోండి

15 Aug, 2021 04:11 IST|Sakshi

అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో.. కొత్తగా పింఛన్లకు అర్హత ఉన్న వారు ఆగస్టు 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన వారంతా మీ–సేవ/ఈ–సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ పింఛన్లు పొందే అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన విషయం తెలిసిందే.

లబ్ధిదారుల ఎంపికలో పాటించాల్సిన ప్రమాణాలను ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వయసు నిర్ధారణకు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు, పాఠశాల బదిలీ సర్టిఫికెట్లు, వయ సు నిర్ధారణ చేసే విద్యా సంస్థల సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తులో కులం, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంక్‌ పేరు, బ్రాంచి పేరు తదితర వివరాలు ఇవ్వాలని పేర్కొంది. మీ–సేవ/ఈ–సేవ కేంద్రాల్లో ఈ దరఖాస్తులకు ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దని ఈ–సేవ కేంద్ర కమిషనర్‌కు సూచించింది. కాగా, వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు తగ్గించినందున, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు