మెడి‘కిల్‌’ సీట్లపై కమిటీ

1 Jun, 2022 04:05 IST|Sakshi

వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈ, కాళోజీ వీసీతో ఏర్పాటు

సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ఆదేశించిన ప్రభుత్వం

ఎన్‌ఎంసీతో సంప్రదింపులు ప్రారంభించిన కమిటీ సభ్యులు

కమిషన్‌కు నేరుగా లేఖ రాయాలని సర్కారు నిర్ణయం!

విద్యార్థులను ఆ కాలేజీల్లోనే కొనసాగించేలా విజ్ఞప్తి చేసే యోచన

మంత్రి హరీశ్‌ను కలిసిన విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెన్నార్, మహవీర్, టీఆర్‌ఆర్‌ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఈ ఏడాది చేరిన ఎంబీబీఎస్, పీజీ విద్యార్థుల అడ్మిషన్లను జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) రద్దు చేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, వైద్య విద్యా సంచాలకుడు రమేశ్‌రెడ్డి ఇందులో ఉన్నారు. అడ్మిషన్లు పూర్తయి, తరగతులు కూడా ప్రారంభించాక మెడికల్‌ సీట్లను ఉపసంహరించుకోవడం సమంజసం కాదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని కమిటీని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఎన్‌ఎంసీ అధికారులతో కమిటీ పలు దఫాలుగా మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఆయా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు చెందిన విద్యార్థులు కొందరు మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి గోడు విన్నవించుకున్నారు. మరికొందరు విద్యార్థులు వరంగల్‌లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులను కలిసి తమ పరిస్థితిని విన్నవించారు. 

సర్దుబాటు సాధ్యం కాదు!
ఒకవైపు ఉన్నతస్థాయి కమిటీ సంప్రదింపులు కొనసాగుతుండగా మరోవైపు ఎన్‌ఎంసీకి నేరుగా లేఖ రాయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మంత్రి హరీశ్‌రావును కలిసిన సందర్భంగా ఆయన ఈ విషయం తమకు చెప్పినట్లు విద్యార్థులు వెల్లడించారు. అడ్మిషన్లకు ముందు అనుమతి ఇచ్చి విద్యార్థులు చేరిన తర్వాత కొంతకాలానికే వాటిని ఉపసంహరించుకోవడం వల్ల విద్యార్థులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని, కాబట్టి వారు ఈ సంవత్సరం ఆయా కాలేజీల్లోనే చదివేలా చూడాల్సిందిగా లేఖలో కోరాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కాలేజీలు నిర్ణీత సమయంలోగా లోపాలను సరిచేసుకునేలా యాజమాన్యాలను ఆదేశించాలి్సందిగా ఎన్‌ఎంసీకి సూచించడంతోపాటు ఆ మేరకు ప్రభుత్వం కూడా ప్రైవేటు కాలేజీలపై ఒత్తిడి తెస్తుందనే హామీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మూడు కాలేజీల్లో పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థులను ఇతర చోట్ల సర్దుబాటు చేయడం సాధ్యం కాదనే విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించే అవకాశముందని చెబుతున్నారు. 

కోర్టుకెళ్లడమే మార్గమా?
వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారినా ఆయా కాలేజీల యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాలు లేనప్పుడు కౌన్సెలింగ్‌జాబితాలో వాటిని ఎందుకు చూపించాల్సి వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కాళోజీ వర్సిటీపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల యాజమాన్యాల కారణంగా ఉత్పన్నమైన ఈ సమస్య పరిష్కారానికి కోర్టుకు వెళ్లడం ఒక్కటే మార్గమని కొందరు అధికారులు చెబుతున్నారు. కాగా, మరిన్ని ప్రైవేటు కాలేజీల్లో సీట్లు రద్దయ్యే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారంతో వసతులు సరిగా లేని కాలేజీల యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది.  

ప్రొఫెసర్లను మీరే తెచ్చుకోండి.. ఇదీ ఓ కాలేజీ వరస
మౌలిక వసతులు లేకపోవడం, అధ్యాపకుల కొరత వంటి ప్రధాన కారణాలతోపాటు ఇతరత్రా కారణాలతో ఎన్‌ఎంసీ అడ్మిషన్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఒక కాలేజీలో కీలకమైన పీజీ స్పెషలైజేషన్‌కు ప్రొఫెసర్లు లేనేలేరు. లైబ్రరీ వసతి లేదు. దీనిపై కొందరు విద్యార్థులు ఇటీవల యాజమాన్యాలను నిలదీస్తే ‘మీరే ప్రొఫెసర్లను తెచ్చుకోండి’ అంటూ దురుసుగా సమాధానమిచ్చారని విద్యార్థులు తెలిపారు. ఇలాంటి కాలేజీల్లో చేరి తాము తప్పు చేశామని, ప్రభుత్వం తమ సమస్యపై దృష్టి పెట్టి ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాలని కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు