కౌన్సెలింగ్‌ మాయం..ఆప్షన్లతో ఖాయం

28 Dec, 2021 00:42 IST|Sakshi
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రిటైర్డ్‌ డీఈఓ విజయ్‌కుమార్‌ 

టీచర్ల విభజనలో సర్కారు మరో ట్విస్ట్‌ 

ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిన పనిలేదు 

మొబైల్‌ ఫోన్లకు కేటాయింపు ఎస్సెమ్మెస్‌

సాక్షి, హైదరాబాద్‌: జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు స్కూళ్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వం అనూహ్యంగా వ్యూహం మార్చింది. ఆఖరి క్షణంలో కౌన్సెలింగ్‌ విధానాన్ని రద్దు చేసింది. అన్ని జిల్లా అధికారులకు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.

ఉపాధ్యాయ వర్గాల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాలకు కేటాయింపు ప్రక్రియ మొదలైనప్పటి నుంచీ టీచర్లు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు ఐక్య కార్యాచరణకు దిగడం, సెక్రటేరియట్‌ ముట్టడి వంటిని రసన కార్యక్రమాలు చేపట్టనుండడంతో విభజన ప్రక్రియ ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంటోంది.

దీంతో ప్రభుత్వ వర్గాలు సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి విభజనలో జిల్లా మా రిన ఉద్యోగులకు కౌన్సెలింగ్‌ ద్వారా స్కూల్‌ ను కేటాయించేలా ప్రభుత్వం మార్గదర్శకాలిచ్చింది. దీని ప్రకారం భార్యాభర్తలు, ఇతర మినహాయింపు వర్గాలు ఆప్షన్లు ఇచ్చే గడువు సోమవారంతో ముగిసింది. 28 నుం చి కౌన్సెలింగ్‌ చేపట్టి 30వ తేదీన స్కూలును కేటాయిస్తూ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. 

మంగళవారం వరకు పొడిగింపు?: 
మారిన వ్యూహం నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన ఉద్యోగుల నుంచి ప్రస్తుతం ఆప్షన్లు మాత్రమే తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆప్షన్ల గడువు మంగళవారం వరకు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ పద్ధతిలో టీచర్లు ఆయా కౌన్సెలింగ్‌ లేదా జిల్లా కేంద్రాలకు వెళ్లి సీనియారిటీ ప్రకారం తనను పిలిచినప్పుడు అధికారుల ముందు హాజరై స్కూల్‌ను ఎంపిక చేసుకునే వీలుంది.

కానీ ఇప్పుడు కేవలం టీచర్‌ ఇచ్చిన ఆప్షన్‌ ఆధారంగా అధికారులే స్కూల్‌ను కేటాయించి, వాట్సాప్‌లో సంక్షిప్త సందేశం ద్వారా సమాచారం అందిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఏ టీచర్‌ కూడా కౌన్సెలింగ్‌ కేంద్రానికి, జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదని చెప్పాయి. అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఇప్పటికే సీనియారిటీ వల్ల స్థానిక జిల్లాలు కోల్పోయిన తమకు మరోసారి ఇష్టమైన ప్రాంతాన్ని ఎంచుకునే అవకాశం లేకుండా పోతోందని, ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ ఉంటే నేరుగా ఒకటి కాకపోతే మరొకటి కోరుకునే వీలుంటుందని చెబుతున్నారు. 

మరోసారి మోసం
ప్రత్యక్ష కౌన్సెలింగ్‌ను తీసివేసి టీచర్లను ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోంది. కౌన్సెలింగ్‌లో నేరుగా ఉంటే ఉపాధ్యాయులు కావాల్సిన స్కూలును ఎంచుకోవచ్చు. ఇప్పుడు 200 ఆప్షన్లు ఇవ్వాలి. పైగా పై స్థాయిలో ఆప్షన్లను తారుమారు చేసే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన ఏ హామీనీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.     
– చావా రవి (యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి)

మరిన్ని వార్తలు