‘స్పౌజ్‌’పై సానుకూలత!

4 Jan, 2022 01:33 IST|Sakshi

ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కూడా..

సెంటర్, స్టేట్‌ స్పౌజ్‌ కేసులు పెండింగ్‌లోనే..!

బదిలీలపై అప్పీళ్లు పరిష్కరించిన వెంటనే పోస్టింగ్‌ ఉత్తర్వులు

మొత్తం 8 వేల వినతుల పరిశీలన.. జిల్లాల వారీగా జాబితాలు రెడీ

సాక్షి, హైదరాబాద్‌: జోనల్‌ విధానం అమలు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులకు వీలైనంత త్వరగా పనిచేసే ప్రదేశాలకు సంబంధించిన పోస్టింగ్‌ ఉత్తర్వులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో ప్రధాన సమస్యగా మారిన ఉపాధ్యాయుల బదిలీల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ముఖ్యంగా వేల సంఖ్యలో అందిన విజ్ఞప్తులను ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పరిష్కరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు బదిలీలకు సంబంధించిన అభ్యంతరాలతో ఇప్పటివరకు మొత్తం 8 వేల వినతులు (అప్పీళ్ళు) అందాయి. 5 వేలకు పైగా స్పౌజ్, ఒంటరి మహిళలు, వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు తాము పనిచేస్తున్న ప్రాంతంలోనే ఉంచాలని కోరుకున్నారు. అయితే ఇందులో భార్య లేదా భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న అర్జీలు 1,500 వరకు ఉన్నాయి. వీటిని ప్రస్తుతానికి పక్కన బెట్టాలని భావిస్తున్నారు. మిగిలిన 3,500 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు సానుకూలంగా స్పందించేందుకు సిద్ధమయ్యారు. 

సీనియారిటీ అర్జీల పరిశీలన
మరోవైపు సీనియారిటీలో తమకు అన్యాయం జరిగిందని అర్జీలు పెట్టుకున్న వాళ్ళలో ఆధారాలున్న వాటిని పరిశీలించారు. పదోన్నతి పొందిన నాటి నుంచి సీనియారిటీ పరిగణనలోనికి తీసుకోవడం వల్ల కొంతమంది స్థానికత కోల్పోతున్నారు. వీళ్ళలో కొందరు పదోన్నతి వద్దని, స్థానిక ప్రాంతంలోనే ఉంచాలని కోరుతున్నారు.

దీర్ఘకాలిక వ్యాధుల్లో కొన్నింటికి ఆమోదం తెలిపేందుకు జిల్లా కలెక్టర్లు సిద్ధంగా ఉన్నారు. వీటన్నింటిపై విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు జిల్లాల వారీ జాబితాలతో ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను పంపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ అందిన మరుక్షణమే ఉత్తర్వులపై నిర్ణయం తీసుకునే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

317 జీవోపై సంఘాల నిప్పులు
జోనల్‌ విధానం కోసం తీసుకొచ్చిన 317 జీవోపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) నేతృత్వంలో 317 జీవోకు వ్యతిరేకంగా 33 జిల్లాల కలెక్టరేట్లు, డీఈవో కార్యాలయాల వద్ద సోమవారం ఆందోళనలు జరిగాయి.

ఉపాధ్యాయ ఖాళీలు చూపించి, సీనియారిటీ జాబితాల్లో తప్పులు సరిచేసిన తర్వాతే బదిలీలు చేపట్టాలని జాక్టో డిమాండ్‌ చేసింది. ఈ కార్యక్రమానికి జాక్టో నాయకులు సదానంద్‌గౌడ్, పర్వత్‌రెడ్డి, ఎం రాధాకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు

తక్షణమే ఉపసంహరించుకోవాలి
ప్రభుత్వం ఈ జీవోను తక్షణమే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని తెలంగాణ ఉద్యోగుల సంఘం (టీఈఏ) హెచ్చరించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్‌కుమార్‌ స్వామి, ఉపాధ్యక్షుడు పురుషోత్తం సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలొడ్డి పోరాడిన ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని వారు ధ్వజమెత్తారు.

ప్రభుత్వం సృష్టించే గందరగోళంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు మానసిక వేదనతో ఉన్నాయని తెలిపారు. అస్మదీయులకు ఇష్టమొచ్చిన చోట పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాగా ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే 317 జీవో తీసుకొచ్చామని విద్యాశాఖ మంత్రి చెప్పడాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. స్థానికతకే ప్రాధాన్యం ఇవ్వాలని చర్చల్లో భాగంగా తాము చేసిన డిమాండ్లను మంత్రి గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు.  

మరిన్ని వార్తలు