చేపా.. చేపా ఏం చేద్దాం? 

1 Aug, 2021 01:33 IST|Sakshi

చెరువుల్లో చేపపిల్లలు వదలడంపై మత్స్యశాఖ తర్జనభర్జన

ఈసారి 99 కోట్ల చేప, రొయ్యపిల్లలు వదలాలని ప్రణాళిక

సాక్షి, హైదరాబాద్‌: మత్స్యకారులకు చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ ఈసారి ఆలస్యమయ్యే సూచనలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముందస్తుగా చేపపిల్లలను చెరువుల్లో వదలాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే చెరువులు అలుగు దూకుతుండడంతో పంపిణీకి కొద్దిరోజులు ఆగితే మంచిదనే ఆలోచనలో మత్య్సశాఖ ఉంది. కొన్ని చెరువులు పూర్తిగా నిండగా, మరికొన్ని చెరువులు సగంకంటే ఎక్కువగా నిండాయి. నిండిన చెరువుల్లో ఇప్పుడే చేపపిల్లలు వదిలితే.. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే.. అవి కొట్టుకుపోయే ప్రమాదముంది. అలాగని, సకాలంలో వదలకపోతే ఎదుగుదల లోపిస్తుంది. దీంతో అధికారులు తర్జనభర్జనపడుతున్నారు.

గతేడాది తేలని లెక్క
గతేడాది ప్రభుత్వం గుర్తించిన చెరువుల్లో ఉచిత చేపపిల్లలు వదిలిన తర్వాత భారీ వర్షాలతో చెరువులు అలుగుదూకాయి. దాదాపు 80 శాతం చెరువుల్లోని చేపలు కొన్ని ఎదురెక్కిపోతే, మరికొన్ని కొట్టుకుపోయాయి. దీంతో ఏ చెరువులో ఎన్ని చేపలున్నాయనే లెక్క తేలలేదు. ఈసారి 43,870 చెరువుల్లో 24వేల చెరువులు పూర్తిగా నిండి అలుగు దూకాయి. మిగతా చెరువుల్లో సగానికంటే ఎక్కువగానే అలుగు దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. గతేడాది చేప, రొయ్యలు కలిపి 71.02 కోట్ల మేరకు చెరువుల్లో వదిలారు. ఈసారి రెండూ కలిపి 99 కోట్ల వరకు వదలాలని మత్స్యశాఖ యోచిస్తోంది. అందుకనుగుణంగా టెండర్లను సిద్ధం చేసింది. 

అప్పుడే కాదు 
భారీ వర్షాలు కురుస్తుండడంతో కొద్ది రోజులు ఆగిన తర్వాత చెరువుల్లో చేప, రొయ్యపిల్లలు వదలాలని అనుకుంటున్నాం. ఈసారి వంద శాతం రాయితీపై చేపపిల్లలు పంపిణీ చేస్తాం.     
– తలసాని శ్రీనివాస్‌యాదవ్, మత్స్యశాఖ మంత్రి  

మరిన్ని వార్తలు