Telangana: టార్గెట్‌ 100!

19 Sep, 2022 01:39 IST|Sakshi

మాతా, శిశు ఆరోగ్యంపై సర్కారు మరింత శ్రద్ధ

గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యస్థితి నిరంతర పరిశీలన

నెలకు 100 మంది లబ్ధిదారుల ఆరోగ్యవివరాల నమోదు

పోషక విలువల్లో లోపాలు గుర్తిస్తే అదనంగా పౌష్టికాహారం పంపిణీ

కనీసం 60% లక్ష్యం పూర్తిచేసిన అంగన్‌వాడీ టీచర్లకు ప్రోత్సాహకాలు   

సాక్షి, హైదరాబాద్‌: మాతా, శిశు ఆరోగ్యంపై ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపుతోంది. పోషకాల లోపం అధిగమించడంతో పాటు ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీ కేంద్రాల్లోని టీచర్లకు ఈ మేరకు లక్ష్యాలను నిర్దేశించింది. కేంద్రంలో నమోదైన ప్రతి లబ్ధిదారుపై నిరంతర పర్యవేక్షణ ఉంచేలా బాధ్యతలు పెట్టింది. ఒక నెల వ్యవధిలో ప్రతి అంగన్‌వాడీ టీచర్‌ సంబంధిత కేంద్రం పరిధిలోని కనీసం వంద మంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య స్థితిని అంచనా వేయాలి.

లబ్ధిదారులైన గర్భిణులు, బాలింతలు, పాలిచ్చే తల్లులు, మూడేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య స్థితి పరిశీలనతో పాటు చిన్నారుల బరువు తూచడం, అనారోగ్య సమస్యలు గుర్తిస్తే సమీప ఆస్పత్రులకు రిఫర్‌ చేయడం, అంగన్‌వాడీ కేంద్రం ద్వారా అందించే పోషక విలువలతో కూడిన (న్యూట్రిషన్‌) సరుకుల పంపిణీ పక్కాగా నిర్వహించడంలాంటి కార్యక్రమాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలి. ప్రతి నెలా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసిన టీచర్లకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అన్ని జిల్లాల సంక్షేమాధికారులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సర్క్యులర్లను పంపింది.

అరవై శాతం దాటితే అర్హత..
అంగన్‌వాడీ టీచర్లకు నిర్దేశించిన బాధ్య­తలను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోత్స్రాహకాలను ఇవ్వనుంది. ప్రతి నెలా టార్గెట్‌గా వంద లబ్ధిదారుల పరిశీలనను నిర్దేశించినప్ప­టికీ.. అందులో కనీసం 60 శాతం లక్ష్యం పూర్తి చేసిన వారు ప్రోత్సాహకాల పరిధి­లోకి వస్తారు. వారి పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను ఇవ్వనుంది.

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిని యూనిట్‌గా పరిగణిస్తూ ఆయా టీచర్లకు ప్రోత్సాహకాలు ఇస్తారు. నెలకు సగటున రూ.1,000 వరకు గౌరవ వేతనంతో కలిపి ఇవ్వనున్నట్లు అధికార­వర్గాలు చెబుతు­న్నాయి. వచ్చే నెల నుంచే ఈ ప్రోత్సా­హకాలు ఇచ్చేలా రాష్ట్ర మహి­ళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ క్షేత్రస్థాయి­లోని అంగన్‌వాడీ టీచర్ల పనితీరును మదింపు చేయనుంది.

ఆన్‌లైన్‌లో నమోదు
అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని లబ్ధిదా­­రుల ఆరోగ్యస్థితిని టీచర్లు క్షేత్రస్థాయి­లోకి వెళ్లి రికార్డు చేస్తారు. వారి ఇంటికి వెళ్లి నిర్దేశించిన వివ­రాలు సేక రిస్తారు. వాటిని ఆన్‌లై­న్‌లో నమో­దు చేస్తారు. సలహాలు, సూచ­న­లిస్తారు. పోషక విలు వల్లో లో­పాలు గుర్తిస్తే వారికి అదనపు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రత్యే­క జాబితాలో చేరుస్తారు. అనంతరం వారి ఇంటి వద్దకు అదనపు పౌష్టికా­హారాన్ని పంపి ప్రత్యేక పరిశీలన కేటగిరీలోకి చేర్చుతారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వారి ఆరోగ్యస్థితిని సమీక్షిస్తారు. ఇది నిర్దేశిత పద్ధతిలో  కొనసాగుతుంది.  

మరిన్ని వార్తలు