కరోనాను ఖతం చేద్దాం

19 Oct, 2020 03:05 IST|Sakshi

దసరా, దీపావళి నేపథ్యంలో వైరస్‌ కట్టడి చర్యలకు ప్రభుత్వం నిర్ణయం

పోస్టర్లు, పాటలు, రేడియో జింగిల్స్‌ ద్వారా ప్రచారం  

సాక్షి, హైదరాబాద్‌: దసరా, దీపావళి పండగల వేళ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దృష్ట్యా దీన్ని నివారించేందుకు విస్తృత ప్రచారం చేపట్టేందుకు సర్కారు సమాయత్తమైంది. సోషల్‌ మీడియా సహా వివిధ రకాల ప్రచార సాధనాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ యాసలో ఆకట్టుకొనే నినాదాలు, ప్రత్యేక పాటలు సిద్ధం చేసింది. అలాగే పండుగల సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు మార్గదర్శకాలు జారీ చేసింది.

మీలో మాస్క్‌ మహారాజు ఎవరు? 
బతుకమ్మను తీసుకెళ్లే మహిళలు మాస్క్‌ లు ధరించి కరోనాను కట్టడి చేయాలని చెప్పేలా ప్రత్యేక పోస్టర్‌ను అధికారులు విడుదల చేశారు. ‘ఈ పండుగ వేళ శుభ్రతే మన భద్రత’, ‘కరోనాఖేల్‌ ఖతం చేద్దాం.. ప్రతీ ఇంటా సంబురాలు షురూ చేద్దాం’ వంటి నినాదాలను పోస్టర్లపై ముద్రిం చారు. ఇంకో పోస్టర్‌లో ‘మీలో ఎవరు మాస్క్‌ మహారాజు?’ అంటూ  తీర్చిదిద్దారు. ‘మాస్క్‌ మహారాజు ఎప్పుడూ సరిగ్గా మాస్క్‌ వేసుకుంటడు’, ‘చేతులు సబ్బుతో మంచిగా శుభ్రం చేసుకుంటడు’, ‘గుంపులల్ల దూరడు... ఆరడుగుల దూరం పాటిస్తడు’, ఇవన్నీ మీరు చేస్తుం టే మీరే మాస్క్‌ మహారాజు..అంటూ ఆకట్టుకొనే రీతిలో కార్టూన్లు ప్రదర్శించారు.  మరో పోస్టర్‌లో ‘కరోనా’సురునిపై సంధించిన 3 బాణాలు చూపి స్తూ ‘కరో నా’సురుడిని అంతమొందించా లని చూపించారు. బతుకమ్మ పాటలతో రేడియో జింగిల్స్‌ను తయారు చేశారు. 

పండుగలు ఏటా వస్తాయి.. ప్రాణాలు పోతే తిరిగిరావు 
‘పండుగలు ఏటా వస్తాయి, ప్రాణాలు పోతే తిరిగిరావు’అని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రజలను హెచ్చరించారు. ఈ ఒక్కసారికి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన వైద్యవిద్యా సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. కేరళలో ఓనం పండగ తర్వాత కరోనా కేసులు భారీగా పెరిగిన విషయాన్ని శ్రీనివాసరావు గుర్తు చేశారు. వర్షాలు, వరదల కారణంగా రోగాలు ముసిరే ప్రమాదం ఉన్నందున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాసరావు ప్రజలను కోరారు.  

మరిన్ని వార్తలు