‘టీఎన్‌జీవో’ అక్రమాలపై సర్కార్‌ సీరియస్‌ 

20 Sep, 2020 03:54 IST|Sakshi

హౌసింగ్‌ సొసైటీ అక్రమాలపై విచారణకు ఆదేశం  

రిజిస్ట్రేషన్, సహకార శాఖలు వేర్వేరుగా విచారణ 

ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌కు స్థానచలనం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: టీఎన్‌జీవో హౌసింగ్‌ సొసైటీలో జరిగిన భూ కేటాయింపు అవకతవకలపై ప్రభుత్వం స్పందించింది. ‘గూడు’పుఠాణీ’అనే శీర్షికన శనివారం సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు.. శాఖల వారీగా సొసైటీలో జరిగిన నిబంధనల ఉల్లంఘన, అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న జి.నరేందర్‌కు స్థానచలనం కల్పించారు. ఆయనను ఖమ్మం చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా నియమించారు. ఇక హౌసింగ్‌ సొసైటీలో రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలకు సంబంధించి జరిగిన అక్రమాలపై ప్రాథమిక విచారణ చేపట్టాలని వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ డీఐజీ జిల్లా రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్‌ సొసైటీ వ్యవహారాలను పర్యవేక్షించే సహకార శాఖ సైతం ఏదులాపురం, దానవాయిగూడెం ప్రాంతాల్లో టీఎన్‌జీవోలకు నివేశన స్థలం ఇవ్వడానికి కేటాయించిన 103 ఎకరాల 26 గుంటలు కాకుండా.. సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను సైతం ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించారనే ఆరోపణలపై సహకార శాఖ జిల్లా అధికారి విజయకుమారి ముగ్గురు అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీటీఎన్‌జీవోలకు ప్రభుత్వం నివేశన స్థలాల కోసం కేటాయించిన స్థలం కాకుండా ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగిందా..? నివేశన స్థలాలను ఏ ప్రాతిపదికన కేటాయించారు..? వంటి అంశాలపై విచారణ చేయాలని జిల్లా సహకార అధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు