కమిటీలు వేసి, ఆప్షన్లు తీసుకొని పోస్టింగ్‌లు
ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో తొలుత ప్రక్రియ
ఈ నెల 16 తర్వాత మిగతా జిల్లాల్లో మొదలు
టీజీవో, టీఎన్జీవోల ప్రతినిధులతో సీఎస్ చర్చలు
జోనల్, మల్టీజోనల్ ఉద్యోగుల విభజనపై త్వరలో సీఎంతో ఉద్యోగ నేతల భేటీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల పంపిణీపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. జిల్లా కేడర్ ఉద్యోగుల విభజన ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. తొలుత కోడ్ లేని జిల్లాల్లో పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టనుంది. మిగతా జిల్లాల్లో ఈ నెల 16 తర్వాత ప్రక్రియ మొదలుపెట్టనుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి.. కొత్త జిల్లాల మధ్య పోస్టులను విభజించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీచేయనుంది. ఇక ఉపాధ్యాయుల విభజనకు సంబంధించి మరో సమావేశం నిర్వహించాక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు తెలిసింది.
తొలుత జిల్లా స్థాయిలో.. : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 33 జిల్లాలకు అనుగుణంగా ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లతో కొత్త జోనల్ విధానానికి కొద్దినెలల కిందే రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్ల వారీగా ఉద్యోగుల విభజన జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏయే పోస్టులు ఏయే కేడర్ల కిందకు వస్తాయన్నది ఇప్పటికే ఖరారు చేసింది.
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు పోస్టులు, ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపడుతోంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం బీఆర్కేఆర్ భవన్లో టీజీవో, టీఎన్జీవోల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. ఉద్యోగులందరి నుంచి కేడర్ల వారీగా ఆప్షన్లు స్వీకరించి.. కొత్త జిల్లాలకు కేటాయిస్తామని ఉద్యోగ నేతలకు హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగుల కేటాయింపు సమయంలో.. టీజీవో, టీఎన్జీవోలతోపాటు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన జిల్లాస్థాయి ఉద్యోగ సంఘాలను కూడా ఆహ్వానిస్తామన్నారు.
ఉమ్మడి జిల్లాల వారీగా కమిటీలతో..
జిల్లా కేడర్ పోస్టులు, ఉద్యోగుల విభజనను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనుంది. వీటికి ఉమ్మడి జిల్లా కేంద్రం కలెక్టర్ నేతృత్వం వహిస్తారు, ఇతర జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రతి ఉమ్మడి జిల్లా పరిధిలో సదరు కమిటీ పోస్టులు, ఉద్యోగుల విభజనను చేపడుతుంది. ఇక కొత్త జిల్లాల మధ్య ఉపాధ్యాయల విభజన, బదిలీలపై ప్రభుత్వం త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.
మరోవైపు జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టుల విభజనపై ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌తో సమావేశమై చర్చలు జరుపుతామని ఉద్యోగ నేతలు వెల్లడించారు. సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో జీఎడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్థికశాఖ కన్సల్టెంట్ శివశంకర్‌లతో రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన కమిటీ.. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విభజనను పర్యవేక్షించనుంది. ఆదివారం సీఎస్‌తో జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులు వికాస్‌రాజ్, రోనాల్డ్ రోస్, సీఎం ప్రత్యేక కార్యదర్శి వి.శేషాద్రి, టీఎన్జీవోల కార్యదర్శి ప్రతాప్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, టీజీవోల కార్యదర్శి సత్యనారాయణ, సహాధ్యక్షుడు సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానికత, సీనియారిటీకి నష్టం జరగకుండా..
కొత్త జిల్లాల ప్రకారం కేడర్ ఉద్యోగుల విభజన ప్రక్రియలో.. ఉద్యోగుల స్థానికత, సీనియారిటీకి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. సీఎస్‌తో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాల ఉద్యోగులు.. సదరు ఉమ్మడి జిల్లా పరిధిలో ఏర్పాటైన కొత్త జిల్లాలకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించాలని సీఎస్‌ను కోరామని.. ఆయన సానుకూలంగా స్పందించారని రాజేందర్ చెప్పారు. ఈ ప్రక్రియకు సంబంధించి తాము పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్టు తెలిపారు. ఆ సూచనలు,
సలహాలివీ..
విభజనకు సహకరిస్తాం
డిసెంబర్ నెలాఖరులోగా ఉద్యోగుల నుంచి ఆఫ్‌లైన్‌లో ఆప్షన్లు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియకు ఎలాంటి భేషజాలు లేకుండా ఉద్యోగులంతా సహకరిస్తాం. ఉద్యోగాల నోటిఫికేషన్లపై త్వరలోనే సీఎం కేసీఆర్ భేటీ నిర్వహించనున్నారు. – టీజీవోల అధ్యక్షురాలు మమత
ఖాళీ పోస్టులపై త్వరలోనే స్పష్టత!
కొత్త జిల్లాల వారీగా పోస్టులు, ఉద్యోగుల విభజన పూర్తయితే.. ఖాళీ పోస్టుల సంఖ్య ఎంత, ఏయే పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ప్రస్తుతం 85వేల నుంచి లక్ష వరకు కొలువులు ఖాళీగా ఉన్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఈ లెక్క తేలాక పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు ప్రకటిస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది.