కొలువుల జాతర!

10 Aug, 2020 04:10 IST|Sakshi

ప్రైవేటు రంగంలో కొలువుల భర్తీకి కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్‌

కార్పొరేట్‌ కంపెనీల యాజమాన్యాలతో సమన్వయం

కంపెనీల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు సేకరిస్తున్న అధికారులు

కోవిడ్‌–19 తీవ్రత తగ్గాక ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సే్చంజ్‌ ద్వారా జాబ్‌ మేళాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు ఈ మేరకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఓ సంస్థ సహకారంతో డీట్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేస్తున్న ఆ శాఖ.. త్వరలో కార్పొరేట్‌ కంపెనీ యాజమాన్యాలతో సమన్వయం కానుంది. ఆయా కంపెనీలో ఉన్న ఉద్యోగ ఖాళీలకు తగిన అర్హులను గుర్తించి భర్తీ చేయనుంది. ఇందులో జిల్లా ఎంపాయ్‌మెంట్‌ ఎక్సే్చంజ్‌లు కీలక పాత్ర పోషించనున్నాయి.

ప్రతి జిల్లాలో జాబ్‌మేళా..: ఇదివరకు ఎంప్లాయిమెంట్‌ ఎక్ఛేంజ్‌లో ఉద్యోగ మేళాలు నిర్వహించినప్పటికీ ఒకట్రెండు కంపెనీలు మాత్రమే పాల్గొనేవి. ఇప్పుడలా కాకుండా కంపెనీల వారీగా ఉన్న ఉద్యోగా లను కేటగిరీలుగా విభజించి ఆమేరకు ఒక్కో కేటగిరీని భర్తీ చేస్తారు. అభ్యర్థుల ఆసక్తిని బట్టి కంపెనీలను ఎంపిక చేసుకోవచ్చు. కంపెనీల వారీగా ఖాళీల వివరాలను సేకరించిన తర్వాత వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఆన్‌లైన్‌ పద్దతిలోనే జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛేంజ్‌ ద్వారా జాబ్‌ మేళా నిర్వహించి భర్తీ చేస్తారు. కోవిడ్‌–19 తీవ్రత తగ్గిన తర్వాత అప్పటి పరిస్థితులకు తగినట్లు జాబ్‌మేళాలు నిర్వహించనున్నట్లు కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. 

ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలను గ్రామీణ యువత అందిపుచ్చుకునేలా కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలతో సంప్రదించి ఉద్యోగ ఖాళీల భర్తీపై చర్చలు జరిపింది. ఇందులో భాగంగా డీట్‌ వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టిన అధికారులు..తాజాగా నేరుగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అర్హతలేమిటి...అభ్యర్థుల నియామకం ఎలా చేపట్టాలనే దానిపై కంపెనీల వారీగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు.  (ఆన్‌లైన్‌ పాఠాలా.. జర జాగ్రత్త..)

>
మరిన్ని వార్తలు