మిడ్‌మానేరుకు స్కానింగ్‌!

16 Aug, 2020 01:06 IST|Sakshi

రిజర్వాయర్‌ కింద వరదను ఎదుర్కొనే చర్యలపై ప్రభుత్వం ఫోకస్‌ 

ఎమర్జెన్సీ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌కు వినతి 

డ్యామ్‌ బ్రేక్‌ అనాలిసిస్‌ అధ్యయనం చేయాలని వినతి 

ఇప్పటికే రెండుమార్లు కట్ట తెగిన అనుభవాలతో రంగంలోకి..

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి ఏడాది ఎడతెరిపిలేని వానలు.. పోటెత్తుతున్న వాగులు, వంకలు.. పరవళ్లుతొక్కే వరద ప్రవాహాలు.. వెరసి ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిడ్‌మానేరు రిజర్వాయర్‌ పరిధిలో వరద నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మిడ్‌మానేరు గుండె కాయలాంటిది. కీలకమైన ఈ రిజర్వాయర్‌ పరిధిలో గతంలో రెండుసార్లు కట్ట తెగిన దృష్ట్యా వరదను ఎదుర్కొనే ఎమర్జెన్సీ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని నిర్ణయించింది. డ్యామ్‌ బ్రేక్‌ అనాలిసిస్‌లో భాగంగా ఉండే ఎమర్జెన్సీ యాక్షన్‌ ప్లాన్‌ నిమిత్తం పుణేలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌)కు ప్రాజెక్టు అధికారులు లేఖ రాశారు.  మేడిగడ్డ నుంచి ఎత్తిపోసే నీళ్లు ఎల్లంపల్లిని దాటి మిడ్‌మానేరుకు చేరుకుంటాయి. మిడ్‌మానేరు నుంచి ఎస్సారెస్పీ పునరుజ్జీవం వైపు, దిగువ లోయర్‌ మానేరు, అనంతగిరి, రంగనాయక్‌సాగర్‌ మీదుగా కొండపోచమ్మ వైపు నీళ్లు సరఫరా అవుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని భాగాలకు ఇక్కడి నుంచే నీటి సరఫరా ఉండటంతో రిజర్వాయర్‌ పటిష్టత కీలకం. 5 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చినా తట్టుకునేలా ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. 

యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధమైతే...: ఈ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధమైతే ఎగువ నుంచి వరదను అంచనా వేయడంతో పాటు ఏ స్థాయి లో వరద వస్తే రిజర్వాయర్‌లో ఎంతమేర నీటిని నిల్వ చేయాలి, ఎంతమేర దిగువకు వదలాలి? అన్న అంచనాకు రావచ్చు. ఈ వరద అంచనాలకు అనుగుణంగా దిగువ రిజర్వాయర్‌కు నీటి విడుదల చేయడం, లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడం వంటివి ముందస్తుగానే సిద్ధం చేసుకోవచ్చని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు.

గత ఏడాది ఆగస్టులో ఏమైందంటే... 
గతేడాది సైతం ఆగస్టులో మిడ్‌మానేరులో 15 టీఎంసీల మేర నీటిని నింపిన అనంతరం రిజర్వాయర్‌ పరిధిలో కొన్ని సీపేజీలు ఏర్పడ్డాయి. కట్టకు దిగువన ఏర్పడ్డ ఒర్రెలతోనూ సమస్యలు వచ్చాయి. దీంతో 10 కిలోమీటర్ల పొడవైన కట్టను పూర్తి స్థాయిలో పరీక్షించి, రాక్టో నిర్మాణాలను పరిశీలించి, కట్ట 2.450 కిలోమీటర్‌ నుంచి 2.700 కిలోమీటర్లు మేర పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు రూ.16 కోట్లు ఖర్చు చేశారు. ఈ లీకేజీల మరమ్మతుల కోసం హడావుడిగా రిజర్వాయర్‌ను ఖాళీ చేయాల్సి వచ్చింది.

ఈ సంఘనటకు ముందు 2016లో రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తికాక ముందే ఎగువన ఉన్న కూడవెళ్లి వాగు, మానేరు వాగుల నుంచి ఒక్కసారిగా 2.50 లక్షల క్యూసెక్కులకుపైగా వరద పోటెత్తడంతో రిజర్వాయ ర్‌కు ఎడమవైపు 130 మీటర్ల మేర కట్ట తెగిపోయింది. దీంతో దిగువన ఉన్న 12 వేల మంది ప్రజలను çసురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఈ నేపథ్యం లో వరదను ఎదుర్కొనేలా ఎమర్జెన్సీ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని సర్కారు నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు