విద్యుత్‌ సబ్సిడీ 36,890 కోట్లు!

26 Sep, 2022 03:33 IST|Sakshi

సాగుకు ఉచిత కరెంటు కోసం ప్రభుత్వం చేసిన వ్యయం

కొత్తగా 7.93 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు

రూ.37,099 కోట్లతో ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థల బలోపేతం

8 ఏళ్ల విద్యుత్‌రంగంపై సర్కారు ప్రగతి నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావం నుంచి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం రూ.36,890 కోట్లు ఖర్చు చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి వ్యవసాయానికి పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు విద్యుత్‌ సరఫరా చేసేవారు.

రాష్ట్రం ఏర్పడిన ఆర్నెల్లలోనే రైతులకు 9 గంటల కరెంటును సీఎం కేసీఆర్‌ అందుబాటులోకి తెచ్చారు. రైతుల కరెంట్‌ కష్టాలను తీర్చడానికి 2018 జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. 7.93 లక్షల కొత్త కనెక్షన్లు జారీ చేయడంతో రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 26.96 లక్షలకు పెరిగింది. రాష్ట్ర విద్యుత్‌ రంగం సాధించిన ప్రగతిపై ఆదివారం విడుదల చేసిన ప్రగతి నివేదికలో ప్రభుత్వం ఈ విషయాలను వెల్లడించింది.

పంపిణీ వ్యవస్థ పటిష్టం
రాష్ట్రంలో నిరంతరం పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించడానికి గత 8 ఏళ్లలో ప్రభుత్వం రూ.37,099 కోట్లను ఖర్చు చేసింది. ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ బలోపేతం కోసం రాష్ట్రంలో కొత్తగా 400–17200 కేవీ సబ్‌స్టేషన్లు 48, 132కేవీ సబ్‌స్టేషన్లు 72, ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్లు 137 నెలకొల్పడంతోపాటు ఈహెచ్‌టీ లైన్‌ను 11,107 సర్క్యూట్‌ కి.మీ మేర ఏర్పాటుచేసింది.

విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి డిస్కంలు 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 1038, 3.65 లక్షల డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశాయి. దీంతో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 14,160 మెగావాట్లకు పెరిగినా విజయవంతంగా సరఫరా చేయగలిగారు. గతంలో పవర్‌ హాలిడేలతో మూతబడే పరిస్థితికి చేరిన పరిశ్రమలు ఇప్పుడు 24 గంటల విద్యుత్‌తో నిరంతరంగా పనిచేస్తూ ఉపాధి కల్పిస్తున్నాయి. తెలంగాణ తలసరి విద్యుత్‌ వినియోగం 2014లో 1,110 యూనిట్లు ఉంటే 2021 నాటికి 2,012 యూనిట్లకు చేరింది.

జాతీయ సగటుతో పోల్చితే 73శాతం అధికంగా ఉండటం రాష్ట్ర ప్రగతికి నిదర్శనం. దేశంలో అతి తక్కువగా 2.47శాతం ట్రాన్స్‌మిషన్‌ నష్టాలు, 99.98 శాతం ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ లభ్యతతో తెలంగాణ ట్రాన్స్‌కో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 16.06 శాతం ఉన్న విద్యుత్‌ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం (ఏటీఅండ్‌సీ) ఇప్పుడు 11.01శాతానికి తగ్గింది. సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 73 మెగావాట్ల నుంచి 4,950 మెగావాట్లకు పెరిగింది. 

బడుగులకూ ఉచిత విద్యుత్‌
రాష్ట్రంలో 5,96,642 ఎస్సీ, 3,21,736 ఎస్టీ గృహాలకు ప్రతి నెలా 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు 2017 నుంచి ఇప్పటివరకు రూ.656 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 29,365 సెలూన్లకు, 56,616 లాండ్రీ షాపులకు ప్రతినెలా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తోంది. 6,667 పౌల్ట్రీ యూనిట్లు, 491 పవర్‌లూమ్స్‌కు యూనిట్‌కి రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తోంది.    

మరిన్ని వార్తలు