రాష్ట్రంలో పర్యాటకానికి అనుమతి 

1 Oct, 2020 02:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని పర్యాటక ప్రాంతాలు గురువారం నుంచి తెరుచుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌–5లో భాగంగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలోని పర్యాటక ప్రాంతాలు, కోటలు, ప్రదర్శనశాలలు(మ్యూజియంలు), జలాశయాల్లో బోటింగ్‌ వసతి, పర్యాటక బస్సులు..అన్నింటికీ పచ్చజెండా ఊపింది. అన్ని చోట్లా కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ నిబంధనలు అమలులో ఉంటాయి.

పర్యాటకులు కచ్చితంగా మాస్కులు ధరించి రావటంతోపాటు ఆరడుగుల మేర భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. పర్యాటక శాఖ సిబ్బంది మాస్కు లు, గ్లౌజులు ధరించటంతోపాటు శానిటైజ్‌ చేసుకుంటూ ఉండాలని ఆదేశించింది. అన్ని పర్యాటక ప్రాంతాల్లో పెడల్‌ శానిటైజర్‌ స్టాండ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

భౌతికదూరం ఉండేలా బస్సుల్లో సీటింగ్‌ 
పర్యాటక బస్సుల్లో కోవిడ్‌ నిబంధనల ప్రకా రం నిర్ధారిత భౌతికదూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాటు చేయాలని టూర్‌ ఆపరేటర్లను, పర్యాటక ప్రాంతాల్లోని మూత్రశాలలు, బుకింగ్‌ కౌంటర్స్, ఫర్నిచర్‌ తదితరాలను శానిటైజ్‌ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే హరిత రెస్టారెంట్లను పర్యాటకాభివృద్ధి సంస్థ తెరిచిన విషయం తెలిసిందే.

అన్ని రకాల పార్కు లు, క్రీడా ప్రాంగణాలు కూడా తెరుచుకోనున్నాయి. నగరంలో గోల్కొండ తెరిచి ఉంచ గా, చార్మినార్‌కు మాత్రం ఇంకా అనుమతి రాలేదు. చార్మినార్‌ పైకి ఎక్కేమెట్ల దారి ఇరుకుగా ఉండటంతో పర్యాటకులు పరస్పరం తగులుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేప థ్యంలో దాన్ని ప్రారంభించలేదు. బుధవారం రాత్రి వరకు కూడా తమకు ఎలాంటి ఆదే శాలు రాలేదని అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు