Telangana: లాక్‌డౌన్‌ గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన టీ సర్కార్‌

11 May, 2021 18:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడి కోసం తెలంగాణ సర్కార్‌ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు గంటల పాటు జరిగిన క్యాబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 20న మరోసారి క్యాబినెట్‌ భేటీ జరగనుంది. లాక్‌డౌన్‌ కొనసాగించడమా లేదా అన్న దాని గురించి ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక మే 12 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయం, మీడియా, విద్యుత్‌ రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిచ్చారు. ప్రభుత్వ ఆఫీసులన్ని 33 శాతం సిబ్బందితోనే పని చేస్తాయి. బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా కార్యక్రమాలు కొనసాగిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యకలపాలు, ఉపాధి హామీ పనులకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు లభించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, జిమ్ములు మూసివేయాలి. 

రవాణా విషయానికి వస్తే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. సిటీ బస్సులు, జిల్లా సర్వీసులు కూడా లాక్‌డౌన్‌ సడలింపు సమయంలోనే నడుస్తాయి. ఆయా డిపోల పరిధిలో బస్సుల సమయాలను అడ్జెస్ట్ చేస్తారు. ఇతర రాష్టాలకు బస్సులు నడపమని తెలిపారు. జాతీయ రహదారులపై రవాణాకు అనుమతి ఇచ్చింది. అంత్యక్రియలకు 20 మంది.. వివాహాలకు 40 మందికి మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్లు, మందుల సరఫరాలో అవకతవకలు అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయగా, అందుకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. 
 

క్యాబినెట్ నిర్ణయాలు :
మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి..  10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది. 

మే 20వ తేదీన క్యాబినెట్ తిరిగి సమావేశం అవుతుంది. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.

యుద్ధ ప్రాతిపదికన.. వ్యాక్సిన్ ప్రొక్యూర్ మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. 

ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను  క్యాబినెట్ ఆదేశించింది. 

అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం.

రెమిడిసివర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో క్యాబినెట్ సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరిన సీఎం. 

ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారు. 

 లాక్‌డౌన్‌ ముగిసేవరకు మెట్రో సర్వీసులు కూడా బంద్‌.

లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు :
వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు. 

 తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. 

వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు. 

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది. 
విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి. 
జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది. 
జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. 
కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు

ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.
ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి. 
అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి
అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి

తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ  ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది. 
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి. 
కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది. 

చదవండి: తెలంగాణలో లాక్‌డౌన్‌: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు