తహసీల్దార్లకే ‘నాలా’ అధికారాలు!

9 Oct, 2020 08:36 IST|Sakshi

ఇకపై ఎన్‌వోసీల విధానానికి ఫుల్‌స్టాప్‌..

మూడో వారంలో రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్లకు శిక్షణ 

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. కొత్త రెవెన్యూ చట్టంలో రెవెన్యూ అధికారుల అధికారాలను కుదించిన సర్కారు.. తాజాగా వ్యవసాయేతర భూమి నియోగ మార్పిడి(నాలా) అధికారాల నుంచి ఆర్డీవోలను తప్పించే అంశాన్ని పరిశీలిస్తోంది ఈ అధికారాలను తహసీల్దార్లకు బదలాయించాలని యోచిస్తోంది. సాగు భూములను ఇతర అవసరాలకు మార్పిడి చేయాలంటే ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు, ప్రతిపాదిత భూమిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆర్డీవో ఆదేశిస్తారు. తహసీల్దార్‌ సిఫారసుకు అనుగుణంగా ఆర్డీవో నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ వల్ల ‘నాలా’జారీ ఆలస్యం కావడమేగాకుండా.. అక్రమాలు కూడా జరుగుతున్నాయని గుర్తించిన సర్కారు ఈ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. భూ వినియోగ మార్పిడిపై దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోపే సాగు భూమి విస్తీర్ణం నుంచి ఇతర అవసరాలకు మళ్లుతున్న భూమిని తొలగించేలా అధికారాలను ఇవ్వాలని నిర్ణయించింది. 

ఎన్‌వోసీలకు మంగళం! 
నిరభ్యంతర పత్రాల(ఎన్‌వోసీ)కు మంగళం పాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన సర్కారు.. ఎన్‌వోసీ కమిటీలను కూడా ఎత్తేస్తోంది. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైని కులు, అమరులు, పోలీసుల కుటుంబాలకు కేటాయించే భూములను విక్రయించుకునే అధికారాలను కలెక్టర్‌ నేతృత్వంలోని ఎన్వోసీ కమిటీలు జారీచేస్తాయి. అయితే, ఈ ఎన్‌వోసీల జారీ కొందరు అధికారుల కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే ఎన్‌వోసీలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయించింది. చెల్లింపుల ద్వారా కేటాయించిన భూములపై నిర్దేశిత కాల వ్యవధి తర్వాత ఆటోమేటిక్‌గా యాజమాన్య హక్కులు బదిలీ చేయాలని నిర్ణయించింది.  

వడివడిగా ‘ధరణి’.. 
దసరా నుంచి సాగు భూముల రిజి్రస్టేషన్లను తహసీళ్లలోనే చేయాలని నిర్ణయించిన సర్కారు.. ఈ నెల మూడో వారంలో తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే ధరణి పోర్టల్‌ సాఫ్ట్‌వేర్‌ను మదింపు చేస్తున్న సాంకేతిక సర్వీసుల శాఖ వచ్చే వారంలో దాని పనితీరును   పరిశీలించనుంది. తహసీళ్లకు సాంకేతిక సౌక ర్యాలు సమకూరుస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే ఉన్న స్వాన్‌ (స్టేట్‌ వైడ్‌ ఏరియా నెట్‌వర్క్‌)కు అదనంగా మరో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌  తీసుకునే వెసులు బాటును తహసీల్దార్లకు కల్పించింది. రాష్ట్రంలోని 590 తహసీళ్లకు  బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ ఉండగా, స్థానికంగా మంచి నెట్‌వర్క్‌ కలిగిన కనెక్షన్‌ అదనంగా తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు