శానిటేషన్‌.. పరేషాన్‌! 

23 Apr, 2022 04:11 IST|Sakshi

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు ఏజెన్సీల ఇష్టారాజ్యం 

అస్తవ్యస్తంగా పారిశుధ్య నిర్వహణ 

ఒప్పందం మేర సిబ్బందిని పంపని తీరు 

తూతూమంత్రంగా క్లీనింగ్‌.. నాసిరకం మెటీరియల్‌ వాడకం 

అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు 

శానిటేషన్‌ సరిగా లేక రోగులకు ఇబ్బందులు  

♦వనపర్తి ప్రభుత్వాస్పత్రిలో చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉన్న ప్రసూతి వార్డు ఇది. గతంలో 100 పడకలతో ఉన్న ఈ ఆస్పత్రిని 330 పడకలకు అప్‌గ్రేడ్‌ చేశారు. ఇక్కడ కనీసం 80 మంది శానిటేషన్‌ వర్కర్లు అవసరం. కానీ ఉన్నది 44 మందే. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగించకపోవడం, సరిగా శుభ్రం చేయకపోవడంతో వార్డులన్నీ కంపు కొడుతున్నాయి. పలు వార్డులు, గదుల్లో పందికొక్కులు తిరుగుతున్నాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు.

♦సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వాస్పత్రి శానిటేషన్‌ స్టోర్‌ గది, ఆస్పత్రిలో వాడే నాసిరకం ఫినాయిల్, ఇతర సామగ్రి ఇవి. ఇక్కడ తగిన శుభ్రత కోసం వినియోగించే సామగ్రి లేదు. కాస్త ఫినాయిల్, బ్లీచింగ్‌ పౌడర్‌ మాత్రమే ఉన్నాయి. 3 నెలలుగా పరిస్థితి ఇలాగే ఉందని సిబ్బంది, రోగులు చెప్తున్నారు.

♦రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుధ్యం దుస్థితికి ఇవి చిన్న ఉదాహరణలు. ఆస్పత్రుల్లో శానిటేషన్‌ పనులు చేసే కాంట్రాక్టు ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తగిన సంఖ్యలో సిబ్బందిని అందుబాటులో ఉంచకపోవడం.. ఏమాత్రం నాణ్యతలేని సామగ్రిని వినియోగించడం.. చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోవడం.. తూతూమంత్రంగా క్లీనింగ్‌ చేయడం వంటివి పరిపాటిగా మారిపోయాయి. అధికారవర్గాలు దీనిని పట్టించుకోకపోవడంతో ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో శానిటేషన్‌ పరిస్థితిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రత్యేక కథనం..

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఇటీవల వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగిని ఎలుకలు కొరకడం.. గతంలో మెదక్‌ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని పందికొక్కులు కొరుక్కుతినడం వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇందుకు ప్రధానంగా పారిశుధ్య లోపం, కొరవడిన పర్యవేక్షణ కారణమనేది సుస్పష్టం. ఇలాంటి సమయంలో అసలు సమస్య ఎక్కడ?

ఎవరు బాధ్యులు? ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్రక్షాళన చేపట్టాల్సిన అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని.. దీనిని ఆసరాగా తీసుకుని శానిటేషన్‌ కాంట్రాక్టు ఏజెన్సీలు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో బుధవారం ‘సాక్షి’ చేపట్టిన విజిట్‌లో ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. ప్రైవేట్‌ ఏజెన్సీల తెంపరితనం, రోగుల అవస్థలు వెలుగుచూశాయి.

సిబ్బంది లేరు.. పరిశుభ్రత అసలే లేదు..
♦ప్రభుత్వాస్పత్రుల్లో నిబంధనల ప్రకారం ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు పర్యాయాలు వార్డులు, ఆవరణ, ఐసీయూ, ఇతర గదులను షిఫ్టుల వారీగా శుభ్రం చేయాలి. కానీ చాలాచోట్ల రెండుసార్లు మాత్రమే శుభ్రం చేస్తున్నారు.

♦శానిటేషన్‌ ఏజెన్సీలు అగ్రిమెంట్‌ ప్రకారం.. నాణ్యమైన డెట్టాల్, ఫినాయిల్, బ్లీచింగ్‌ పౌడర్, ఇతర సామగ్రి వినియోగించాలి. చాలాచోట్ల డెట్టాల్‌ వాడటంలేదు. ఫినాయిల్, బ్లీచింగ్‌ పౌడర్‌ కూడా నాసిరకాలవి వినియోగిస్తున్నారు.

♦శానిటేషన్‌ సిబ్బంది హాజరుకు సంబంధించి ఒకట్రెండు చోట్ల మినహా ఎక్కడా బయోమెట్రిక్‌ హాజరు లేదు. ఏజెన్సీల నిర్వాహకులు దీనిని ఆసరాగా చేసుకుని కొందరితో హాజరుపట్టికలో సంతకాలు చేయించి బయట పనులకు వినియోగించుకుంటున్నారు. ప్రతినెలా పదుల సంఖ్యలో సిబ్బంది వేతనాలను మిగుల్చుకుంటున్నారు.

♦నిబంధనల ప్రకారం శానిటేషన్‌ సిబ్బందికి నెలకు రూ.9,400 వేతనం ఇవ్వాలి. కా>నీ చాలాచోట్ల రూ.8 వేలు, కొన్నిచోట్ల అయితే రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండటంతో పారిశుధ్య సిబ్బంది పనిపై శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

♦కొత్తగా మెడికల్‌ కళాశాలలు ప్రారంభమైన చోట.. వాటికి అనుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుధ్య సిబ్బంది సంఖ్య పెంచలేదు. దానితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెలాఖరులోగా నోటిఫికేషన్‌ వేసి టెండర్‌ ఆహ్వానిస్తామని అధికారులు చెప్తున్నారు.

చాలా చోట్ల ఇదే దుస్థితి..
♦ఖమ్మం జిల్లాలో 400 పడకల ప్రభుత్వాస్పత్రిలో 80 మందే శానిటేషన్‌ సిబ్బంది ఉన్నారు. అందులోనూ కొందరే విధుల్లో ఉంటున్న పరిస్థితి. ఊడవడం, తుడవడం వంటివి ఒకరిద్దరే.. అదీ తూతూమంత్రంగా ముగిస్తున్నారని రోగుల బంధువులు చెప్తున్నారు. టాయిలెట్ల క్లీనింగ్‌ దారుణమని, బ్లీచింగ్‌ పౌడర్‌ కూడా సరిగా చల్లడం లేదని మండిపడుతున్నారు.

♦మెదక్‌ జిల్లాలోని వంద పడకల ఆస్పత్రిలో మూడు విడతల్లో కలిపి కేవలం 15 మంది పారిశుధ్య కార్మికులే ఉన్నారు. వీక్లీ ఆఫ్‌లు, సెలవులు పోగా.. రోజూ పనిచేసేది ముగ్గురు, నలుగురే. దీనితో పారిశుధ్యం కొరవడింది. ఆస్పత్రి ఆవరణలో మార్చురీ పక్కన చెత్తాచెదారం నిండిపోయింది.

జనగామ జిల్లా ఆస్పత్రిలో ఫ్లోర్‌ను తుడుస్తున్న శానిటేషన్‌ వర్కర్‌ ఇతను. ఆస్పత్రిలో 17 మంది శానిటేషన్‌ సిబ్బంది ఉన్నారు. వార్డులను రోజూ మూడుసార్లు శుభ్రం చేయాల్సి ఉండగా.. రెండుసార్లే క్లీన్‌ చేస్తున్నారు. సోప్‌ ఆయిల్, హైపోక్లోరైడ్, యాసిడ్, ఫినాయిల్, బ్లీచింగ్‌ పౌడర్‌ వంటివి నాసిరకంగా ఉన్నాయి.

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో 170 మంది పారిశుధ్య సిబ్బందికిగాను 112 మంది మాత్రమే ఉన్నారు. దానితో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇక మంచిర్యాల ఆస్పత్రి 200 పడకలకు అప్‌గ్రేడ్‌ అయినా.. 40 మందే శానిటేషన్‌ సిబ్బంది ఉన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఎక్కడ చూసినా వ్యర్థాలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి.

దుర్వాసన వస్తున్నా పట్టించుకోవట్లేదు
కాలుకు గాయమవడంతో చికిత్స కోసం భువనగిరి జిల్లా ఆస్పత్రికి వచ్చాను. రెండు రోజులుగా వార్డులో ఉంటున్నాను. మరుగుదొడ్డి నుంచి దుర్వాసన వస్తోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు.
–నర్సింహ, రామచంద్రపురం, భువనగిరి  

మరిన్ని వార్తలు