వృద్ధాప్య పింఛన్‌ రూ.1,500 నుంచి రూ.3,016కు పెంపు

28 May, 2021 10:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వృద్ధ కళాకారులకు ఇచ్చే పెన్షన్‌ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఈ మేరకు, గతంలో ఇస్తున్న రూ. 1,500 పెన్షన్‌ను రూ. 3,016కు పెంచుతూ సాంస్కృతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి కె.శ్రీనివాసరాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపు ఉత్తర్వులు జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వృద్ధ కళాకారుల అర్హత, సమగ్ర సమాచారాన్ని వెరిఫై చేసి పంపాలని సూచించారు.

సీఎంకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కృతజ్ఞతలు 
కళాకారుల వృద్ధాప్య పెన్షన్లను పెంచుతూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెంచిన వృద్ధాప్య పెన్షన్ల వల్ల రాష్ట్రంలోని 2,661 మంది వృద్ధ కళాకారులకు ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ సాహితీవేత్తలు, కళాకారులంటే ఎంతో గౌరవం ఉన్న నాయకుడు కావడం వల్లే పెన్షన్‌ను పెంచి కళాకారుల వికాసం కోసం కృషి చేశారని కొనియాడారు.

మరిన్ని వార్తలు