చిన్న పరిశ్రమలకు చేయూత

13 Dec, 2020 10:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఎక్కడికక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచే చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వీటి ఏర్పాటుకు తోడ్పాటును అందించనుంది. పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 23 లక్షలకు పైగా సూక్ష్మ చిన్న, మధ్య తరహా వ్యాపార, వాణిజ్య సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) ఉండగా, ఇందులో 56 శాతం గ్రామీణ ప్రాంతాల్లో, మరో 44 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 జనవరి నుంచి ఇప్పటివరకు ఎంఎస్‌ఎంఈ రంగంలో రూ.11 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో ఎనిమిది వేల పైచిలుకు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.

ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. ‘ఇన్వెస్ట్‌ ఇన్‌ తెలంగాణ’లో భాగంగా పలు రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించడంతో పాటు ఎంఎస్‌ఎంఈ రంగం అభివృద్ధికి అవసరమైన సాంకేతిక, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా 18 ప్రాధాన్యతా రంగాలను గుర్తించగా, వీటిలో ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ టెండర్లలో అవకాశం
ప్రభుత్వ టెండర్లలో ఎంఎస్‌ఎంఈలు పాల్గొనేలా ఈఎండీ, సెక్యూరిటీ వంటి అడ్డంకులను తొలగించడంతో పాటు, ప్రభుత్వ సంస్థల ద్వారా వీటి ఉత్పత్తుల కొనుగోలు కోసం వార్షిక టర్నోవర్, అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోరు. ఎస్సీ, ఎస్టీ, మహిళల ఆధ్వర్యంలో నడిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యమిస్తారు. మరోవైపు ‘గ్లోబల్‌లింకర్‌’అనే డిజిటల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అమ్మకందారులు, కొనుగోలుదారులను ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐటీ శాఖ సహకారంతో రాష్ట్రంలో 4,500కు పైగా ఎంఎస్‌ఎంఈలు ఇప్పటికే గ్లోబల్‌ లింకర్‌ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకున్నాయి.

ప్రత్యేక పారిశ్రామిక పార్కులు
చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత యాదాద్రి– భువనగిరి జిల్లా దండుమల్కాపూర్‌లో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసింది. గత ఏడాది ప్రారంభమైన ఈ పార్కులో ఏర్పాటయ్యే 450 పరిశ్రమల ద్వారా రూ.1,553 కోట్ల పెట్టుబడు లు వస్తాయని అంచనా. ఈ పార్కుతో 35 వేల కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని పరిశ్రమల శాఖ అంచనా. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే మొట్టమొదటి ఆదర్శ పారి శ్రామిక పార్కుగా అధికారులు చెప్తున్నారు. మ రోవైపు టీఎస్‌ఐఐసీలను ఎంఎస్‌ఎంఈ ల కోసం 18 పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, ఇందులో 6 కొత్తవి. మరో 12 పార్కులను అప్‌గ్రెడేషన్‌ చేయాలని నిర్ణయించారు.

మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంఈలు నష్టాల బారినపడకుండా చూ సే బాధ్యతను తెలంగాణ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌కు అప్పగించారు. పారిశ్రామిక క్లస్టర్లలోని మాన్యుఫ్యాక్చరింగ్‌ ఎం ఎస్‌ఎంఈలలో పెట్టుబడులకు ప్రోత్సాహకాలివ్వడంతో పా టు ఈక్విటీ మార్కెట్లలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహిస్తారు

మరిన్ని వార్తలు