పిల్లల చదువుల కోసం ఎంత చేసినా తక్కువే: కేటీఆర్‌

1 Feb, 2021 16:01 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల: రాష్ట్రంలోని సంక్షేమ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్ధిపై ఏటా 1.20 లక్షల రూపాయలు ఖర్చ చేస్తున్నామని మంత్రి కేటిఆర్ వెల్లడించారు. పిల్లల చదువుల కోసం ఎంత చేసినా తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో ఆధునీకరించిన జడ్పీ హైస్కూల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడున్నర కోట్లతో కార్పోరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా సిరిసిల్ల జడ్పీ ఉన్నత పాఠశాలను ఆధునీకరించామని తెలిపారు. ఇలాంటి పాఠశాలలు ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గడిచిన ఆరున్నర సంవత్సరాల్లో 945 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో అత్యుత్తమ మౌళిక సదుపాయాలు, ఇంటర్ నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో చదివిన విద్యార్ధులు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్ధలతో పోటీ పడి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు. విద్యారంగంలో సమూల సంస్కరణలు రావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను స్థానిక సంస్థలే తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

మరిన్ని వార్తలు