పందులను చంపే అధికారం సర్పంచ్‌కే

27 Jan, 2021 18:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అడవి పందులను చంపేందుకు అనుమతులిచ్చే అధికారం

అటవీ, పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ

సాక్షి, హైదరాబాద్‌: పంటలకు నష్టం చేకూర్చే అడవి పందులను హతమార్చేందుకు అనుమతుల జారీ అధికారాన్ని అటవీ, పర్యావరణ శాఖ గ్రామ సర్పంచ్‌లకు కల్పిం చింది. ఈ మేరకు గ్రామ సర్పంచ్‌ను గౌరవ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రక్షిత ప్రాంతాలు, రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాల వెలుపల అడవి పందుల నుంచి మనుషుల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగే అవకాశాలున్న చోట కొన్ని నిబంధనలకు లోబడి వాటిని అంతమొందించేందుకు సర్పంచ్‌లకు అవకాశం కల్పిం చింది. అయితే రాష్ట్ర స్థాయిలో చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌ ఆదేశాలకనుగుణంగా సర్పంచ్‌లు ఈ పని చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర అధికారి నుంచి ఆదేశాలు వచ్చిన తేదీ నుంచి ఏడాది పాటు ఈ అధికారాలు అమల్లో ఉంటాయని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి (పూర్తి అదనపు బాధ్యతలు) రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు.

‘అడవి పందుల నుంచి పంట నష్టం లేదా ఇతర సమస్యలపై రైతుల నుంచి రాత పూర్వకంగా ఫిర్యాదు ఉంటేనే సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదు అందిన తర్వాత సర్పంచ్, గ్రామ పెద్దలు సంబంధిత ప్రదేశాన్ని సందర్శించి అడవి పందులను హతమార్చాల్సిన పరిస్థితులపై పంచనామా నిర్వహించి సిఫార్సు చేయాలి. అందుకు అనుగుణంగా ఆ పందులను చంపేందుకు సర్పంచ్‌లు ఆదేశాలిస్తారు. వీటి సంహారానికి అటవీశాఖ ప్యానెల్‌లోని షూటర్ల సేవలను ముఖ్యంగా సంబంధిత గ్రామం, మండలం, జిల్లాలో దీనికి సంబంధించిన లైసెన్స్, ఆయుధం, పందులను కాల్చడంలో నైపుణ్యం వంటివి ఉన్న వారిని ఎంపిక చేయాలి. పందులను చంపేటప్పుడు ఇతర జంతువులు, మనుషులు గాయపడకుండా, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు