తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు!

23 Oct, 2021 03:17 IST|Sakshi

ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు అవకాశం!

ఈసారి సాగు పెరగడంతో 1.33 కోట్ల ధాన్యం ఉత్పత్తి అంచనా

కనీసం 1.01 కోట్ల మెట్రిక్‌ టన్నులు కొనాల్సి ఉంటుందని లెక్కలు

అత్యధికంగా నిజామాబాద్‌లో 9 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ

రాష్ట్రవ్యాప్తంగా 6,500 పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో ఉండనున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సీజన్‌లో కోటి మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. ఈ స్థాయిలో సేకరణకు వీలుగా 6,500కుగా పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తోంది. ఇప్పుడిప్పుడే కోతలు మొదలైన దృష్ట్యా..అవసరాలు, ప్రాధాన్యాలకు తగ్గట్లుగా కేంద్రాలను తెరవనుంది. వారం, పది రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం సేకరణ మొదలుకానుంది.  

గణనీయంగా పెరిగిన సాగు 
ప్రస్తుత వానాకాలంలో వరి సాధారణ విస్తీర్ణానికి మించి సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 16.73 లక్షల హెక్టార్లు కాగా, నీటి లభ్యత గణనీయంగా పెరగడంతో ఈసారి ఏకంగా 24.99 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. సాగైన విస్తీర్ణానికి తగ్గట్లుగా కనీసం 1.33 కోట్ల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుం దని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇందులో గృహావసరాలకు 14.23 లక్షల మెట్రిక్‌ టన్ను లు, విత్తన అవసరాలకు 4.86 లక్షల మెట్రిక్‌ టన్నులు పక్కనపెట్టినా, 1.13 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వస్తుందని అంచ నా ఉంది. ఇందులో మిల్లర్లు 12.49 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర కొనుగోలు చేసినా, మిగ తా ధాన్యం అంటే 1.01 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ లెక్కలేసింది. 

మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు 
రాష్ట్ర వ్యాప్తంగా కోతలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. మరో 10 రోజుల తర్వాత నుంచి ఉధృతం కానున్నాయి. వాస్తవానికి గత సోమ వారం నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావించినా ఇప్పటివరకు పదుల సంఖ్యలో కూడా కేంద్రాలు తెరవలేదు.

గన్నీ బ్యాగులతో పాటు టార్పాలిన్లు, తూకం కొలిచే యంత్రాలు, తేమ కొలిచే మిష న్లు మొదలైన వాటిని సమకూర్చుకునే పనిలో పడ్డాయి. కేంద్రాలు ప్రారంభమైతే ఏ ఒక్క సమస్య ఎదురైనా రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితులు ఉండటంతో అన్నింటినీ ముం దే సమకూర్చుకోవాలని జిల్లా యంత్రాంగాలు భావిస్తున్నాయి. అవసరమైనవెన్ని.. అందుబాటులో ఉన్నవెన్ని అనే లెక్కలను పౌరసరఫరాల శాఖకు పంపిన జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను గుర్తించే పనిలో పడ్డారు.

యాసంగిలో రికార్డు స్థాయి కొనుగోళ్లు 
గత ఏడాది యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో 92 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే గత ఏడాది వానాకాలంలో కేవలం 42 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా, ఈ ఏడాది అంతకు రెండింతలకు పైగా ధాన్యం సేకరణ జరగనుంది. జిల్లాల వారీగా చూస్తే అధికంగా నిజామాబాద్‌ జిల్లాలో 9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటుందని లెక్కలు వేయగా, సిద్దిపేట జిల్లాలో 6.86 లక్షలు, జగిత్యాల జిల్లాలో 6.57 లక్షలు, కామారెడ్డి జిల్లాలో 5.80 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ తేల్చింది. 

మరిన్ని వార్తలు