తెలంగాణలో నగరాలు, పట్టణాల అభివృద్ధికి సర్కారు ప్రణాళికలు

11 Dec, 2021 03:46 IST|Sakshi

జోన్లుగా విభజించి.. జీఐఎస్‌తో అనుసంధానించి అమలు 

వానలతో ఇబ్బంది పడకుండా చర్యలు.. పద్ధతి ప్రకారం రోడ్లు, డ్రైనేజీలు 

తొలుత 17 మున్సిపాలిటీల్లో.. తర్వాత రాష్ట్రమంతటా.. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రెడీ చేస్తోంది. వానలకు నగరాలు, పట్టణాలు అతలాకుతలం కాకుండా రూపురేఖలు మార్చాలని సంకల్పించింది. సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, నిర్మాణాలకు అనుమతి, మునిసిపల్‌ నిబంధనలు కశ్చితంగా అమలు చేయడంపై దృష్టి పెట్టబోతోంది.

జీహెచ్‌ఎంసీతో పాటు వరంగల్, ఇతర పట్టణాల్లో గత రెండేళ్లుగా వర్షాలతో ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తు కార్యాచరణకు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను మునిసిపల్‌ శాఖ మంత్రి కె. తారకరామారావు ఆదేశించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆధునిక వసతులతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే పట్టణాలు, నగరాల్లో సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళికబద్ధమైన కార్యాచరణ ఉండేలా సిద్ధమయ్యారు. 

రెసిడెన్షియల్, వాణిజ్య,గ్రీన్‌ జోన్లుగా విభజించి..
మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం నగరాలు, పట్టణాలను నివాస, వాణిజ్య, బఫర్‌ లేదా గ్రీన్‌ జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని మున్సిపల్‌ శాఖ భావిస్తోంది. బెంగళూరు, చండీగఢ్‌ నగరాల తరహాలో ఆయా ప్రాంతాలను జోన్లుగా విభజించి మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేయాలనుకుంటోంది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఉన్న విధానాన్ని పూర్తిస్థాయిలో మార్చలేకపోయినా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రణాళిక పద్ధతిలో రోడ్లు, డ్రైనేజీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

క్రీడా మైదానాలు, ఎగ్జిబిషన్లతో పాటు ప్రజలకు ఉపయోగపడే వాటిని గుర్తించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ జోన్లను జీఐఎస్‌తో అనుసంధానించి భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లు మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 17 మున్సిపాలిటీల్లో జీఐఎస్‌ (జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) ఆధారిత మాస్టర్‌ ప్లాన్లు తయారు చేసి అమలు చేసే పనుల్లో పురపాలక శాఖ పురోగతిలో ఉంది. తర్వాత మిగతా మున్సిపాలిటీలను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. 

పట్టణ ప్రగతి కింద ఇప్పటికే..
పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఇప్పటికే రూ. 2,062 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రూ.858 కోట్లతో 49 నాలాల అభివృద్ధి పనులను 15 ప్యాకేజీల కింద చేపట్టింది. 2,067 పట్టణ ప్రకృతి వనాలు, 400 కిలోమీటర్ల మేర రహదారుల వెంట మల్టీ లెవల్‌ అవెన్యూ ప్లాంటేషన్‌ పనులను పురపాలక శాఖ చేస్తోంది. హైదరాబాద్‌ సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ మాస్టర్‌ ప్లాన్‌ కో సం రూ. 5 వేల కోట్లు వెచ్చించనుంది. వరంగల్‌ వ్యర్థాల బయో మైనింగ్‌ ప్రాజెక్టుతో పాటు పట్టణాల్లో బయో మైనింగ్, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, ఎఫ్‌ఎస్‌ఏపీలను సిద్ధం చేయనుంది.

కరీంనగర్, రామగుండం, నిజామాబాద్‌ కార్పొరేషన్లలో మాస్టర్‌ ప్లాన్లు రెడీ అయ్యాయి. 38 పట్టణాల్లో రూ.1,433 కోట్లతో నీటి సరఫరా పథకాలు, రూ.700 కోట్లతో సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్లు, రూ.61 కోట్లతో మెహిదీపట్నం, ఉప్పల్‌లో స్కై వాక్‌ నిర్మాణాలు, కొత్వాల్‌ గూడ దగ్గర ఎకో పార్క్‌ నిర్మించనున్నారు.  

మరిన్ని వార్తలు