డీపీఆర్‌లపై కదలిక..! 

10 Oct, 2020 02:06 IST|Sakshi

కేంద్ర ఆదేశాల నేపథ్యంలో సంబంధిత సీఈల నుంచి కృష్ణా, గోదావరిలోని 14 ప్రాజెక్టుల డీపీఆర్‌లు కోరిన ఈఎన్‌సీ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ బేసిన్‌ల పరిధిలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఆరంభించింది. డీపీఆర్‌ల సమర్పణకు సంబంధించి ఇరిగేషన్‌ శాఖ వాటిని సిద్ధం చేసే పనిలో పడింది. ఈ విషయమై ఇప్పటికే శాఖ ఈఎన్‌సీ సంబంధిత సీఈలకు లేఖలు రాసినట్లుగా తెలిసింది. కృష్ణా,  గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల డీపీఆర్‌ల అప్‌డేట్‌ వివరాలతో తమకు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరినట్లుగా ఇరిగేషన్‌ వర్గాలు తెలిపాయి. డీపీఆర్‌ల విషయమై అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి అధికారికంగా మినిట్స్‌ అందాక వీటిని సమర్పించే విషయమై తుది నిర్ణయం చేయనుంది.  

కృష్ణా ప్రవాహ వివరాలపై ఏపీకి లేఖ.. 
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల్లోకి గత 20 ఏళ్లుగా వచ్చిన ప్రవాహాలు, వినియోగం, దిగువకు విడుదల చేసిన వరద వివరాలు ఇస్తే మిగులు జలాల లెక్క తేల్చుతామని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు కార్యదర్శి హరికేష్‌ మీనా లేఖ రాశారు. జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తేసి.. వరద జలాలు సముద్రంలోకి కలుస్తున్న సమయంలో దిగువ ప్రాంతాలకు ముంపు ముప్పును తప్పించడానికి పులిచింతలకు ఎగువన రెండు రాష్ట్రాల్లో ఎవరు మళ్లించినా వాటిని ఆ రాష్ట్ర కోటాగా లెక్కించకూడదంటూ జనవరి 1న కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ నిర్వహించిన సమావేశంలో ఏపీ సర్కార్‌ ప్రతిపాదించింది.

దాంతో ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జలసంఘం ఐఎంవో విభాగం సీఈ నేతృత్వంలో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇరు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్‌లో 1999–2000 నుంచి 2019–20 దాకా ప్రాజెక్టులోకి వచ్చిన ప్రవాహాల వివరాలు ఇస్తే సమగ్రంగా అధ్యయనం చేసి, రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న మిగులు జలాలను లెక్కలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై నివేదిక ఇస్తామని కమిటీ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు