మెప్పించి.. ఒప్పించేలా!.. మాస్టర్‌ప్లాన్‌లపై మళ్లీ అధ్యయనం

27 Jan, 2023 05:43 IST|Sakshi
కామారెడ్డి ఫైనల్‌ మాస్టర్‌ప్లాన్‌

ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ముందుకెళ్లేందుకు సర్కారు యోచన

నగరాలు, పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నా ఇంకా కాలం చెల్లిన ‘ప్లాన్‌’లే

రాష్ట్రవ్యాప్తంగా 91 నగరాలు, పట్టణాలకు కొత్త మాస్టర్‌ప్లాన్‌లు అనివార్యం

ఈ నేపథ్యంలోనే బృహత్తర ప్రణాళికలపై సర్కారు దృష్టి

సాక్షి, వరంగల్‌: మాస్టర్‌ ప్లాన్‌ల విషయంలో ప్రజలకు ఆమో­ద­యోగ్యమైన ప్రతిపాదనలతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వేగంగా విస్తరిస్తున్న నగరాలు, పట్టణాలకు అనుగు­ణంగా వాటి అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌లు కీలకంగా మారా­యి. రాష్ట్రంలోని సుమారు 91 నగరాలు, పట్టణా­లకు బృహత్తర ప్రణాళికల రూపకల్పన తక్షణ కర్తవ్యంగా మారింది.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మాస్టర్‌ప్లాన్‌లను కొలిక్కి తేవడంతోపాటు కొత్త మున్సిపాలిటీలలో అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. పలు కార్పొరేషన్‌లు, మున్సిపాలి­టీలకు మాస్టర్‌ప్లాన్‌ – 2041 రూపకల్పన జరుగు­తుంటే కొన్నిచోట్ల వీటిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భూములు, పంట స్థలాలు కోల్పోతున్నవారు ఆందోళనలకు దిగుతు­న్నారు.

కామారెడ్డి, జగిత్యాల­లో పెల్లుబుకిన నిరస­న­లతో ఆయా మున్సిపాలిటీల పాలకవర్గాలు మాస్ట­ర్‌­ప్లాన్‌లను వ్యతిరేకిస్తూ ఏక­గ్రీవ తీర్మానాలు చేసి పంపడంతో అవి రద్దయ్యా­యి. నిర్మల్‌లో కూడా ఉపసంహరించుకున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆమోదయోగ్యమైన ప్ర­త్యా­మ్నా­యాలపై దృష్టి సారించినట్లు సమాచారం. 

ఇప్పటికీ పాతవే.. కొత్తవాటికి కలగని మోక్షం..
రాజధాని హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన వరంగల్‌లో 1972 నాటి మాస్టర్‌ప్లానే ఇప్పటికీ అమల్లో ఉండగా, నిజామాబాద్‌కు 1974 నాటి ప్రణాళికే ఉంది. పదికిపైగా మున్సిపాలిటీల్లో 1990 కంటే ముందునాటి మాస్టర్‌ప్లాన్‌లే అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీలకు కొత్త మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలోని 142 నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థలకు గాను 97 తెలంగాణ రాష్ట్ర టౌన్‌ ప్లానింగ్‌ విభాగం పరిధిలో ఉన్నాయి. వీటిలో 32 పురపాలికలకు బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్‌)ల రూపకల్పనకు అనుమతి లభించగా.. ఇందులో ఎనిమిదింటికి ముసాయిదాలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపించగా పెద్దపల్లి మాస్టర్‌ప్లాన్‌ను మాత్రం ఆమోదించారు.

అలాగే పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో మరో 45 పురపాలికలు ఉండగా.. మాస్టర్‌ప్లాన్ల రూపకల్పన చేపట్టినా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. మొత్తం మీద వీటిల్లో కొత్తగా ఏర్పాటైన 59 మున్సిపాలిటీలకు నాలుగేళ్లు పూర్తయినా అసలు మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన దిశగా అడుగులే పడలేదు. 

వరంగల్‌ ‘కుడా’ మాస్టర్‌ప్లాన్‌ నమూనా 

ప్రత్యామ్నాయాల పరిశీలన..
మొత్తం మీద మాస్టర్‌ప్లాన్‌లు అవసరమైన 91 నగరాలు, పట్టణాలలో 68 కొత్తవాటికి మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేశారు. మహబూబాబాద్, ఆంధోల్‌–జో­గిపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, సత్తుపల్లి, భూపాలపల్లి, దేవరకొండ మాస్టర్‌ప్లాన్లు ఆమోదం కోసం సిద్ధంగా ఉండగా, మరో 15 ప్రభుత్వ ఆమోదం కోసం పంపించేందుకు కసరత్తు పూర్తయింది. తాజాగా రద్దయిన కామారెడ్డి, జగిత్యా­ల, నిర్మల్‌ పట్టణాలకు ప్రత్యామ్నాయ మాస్టర్‌­ప్లాన్లు రూపొందించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ఈ మూడు పట్టణాలతో పాటు, మిగతా వాటికి కొత్తగా రూపొందించే మాస్టర్‌ప్లాన్‌లలో నివాస ప్రాంతం, వాణిజ్య ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతం, మిశ్రమ వినియోగం వంటి వాటితో పాటు ప్రభుత్వ వినియోగం, గ్రీన్‌ కవర్‌లో భాగంగా అడవులు, బఫర్‌జోన్, పర్యావరణ/ప్రత్యేక భూ వినియోగ జోన్, రోడ్లు, రవాణా వ్యవస్థలు.. వాటికి ప్రతిపా­దించిన భూమి విస్తీర్ణం, భూ వినియోగ విధానం తదితర అంశాలపై మరోసారి అధ్యయనం నిర్వ­హిం­చాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. 

సీఎం పేషీలో వరంగల్‌ ఫైల్‌.. 34 నెలలుగా పెండింగ్‌..
వరంగల్‌ మాస్టర్‌ప్లాన్‌–2041 సర్కారు ఆమో­దం కోసం ఎదురుచూస్తోంది. 34 నెలలుగా ముఖ్యమంత్రి పేషీ నుంచి కదలడం లేదని అధికారులే చెబుతున్నారు. ఫలితంగా ఇంకా 50 ఏళ్ల కిందటి ప్లాన్‌నే అమలు చేస్తున్నారు. వాస్తవానికి 2041 వరకు సిటీ అవసరాలకు సరిపోయేలా 2013 లోనే అధికారులు మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేశారు. దాన్ని 2020 మార్చిలో ఆమోదించిన మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌.. సీఎం ఆమోదం కోసం పంపారు. 10.50 లక్షల­కు మించిన జనాభా ఉన్న వరంగల్‌ స్మార్ట్‌ సిటీ కావాలన్నా.. కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు ఫ్యూచర్‌ సిటీగా డెవలప్‌ చేయాలన్నా కొత్త మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయాల్సిన అవసరం ఉంది. 

సీఎం ఆమోదమే తరువాయి
ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికా­రుల పర్య­వేక్షణలో అన్ని వర్గాలకు ఆమోదయో­గ్యంగా ఉండేలా వరంగల్‌ మాస్టర్‌ప్లాన్‌కు రూ­పకల్పన జరిగింది. దానికి అనుగుణంగా నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే అను­మతులు ఇస్తారు. మాస్టర్‌ ప్లాన్‌ సీఎం పేషీలో పెండింగ్‌లో వుంది. ఆమోదం పొందితేనే పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 
– ఎ.అజిత్‌రెడ్డి, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్, కుడా, వరంగల్‌

ఓఆర్‌ఆర్‌కు అవతల ఇండస్ట్రియల్‌ జోన్‌ ఉండాలి
వరంగల్‌ మాస్టర్‌ప్లాన్‌లో ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల ఇండస్ట్రియల్‌ జోన్‌ నిర్ణయించాలి. రహదారుల కనెక్టివిటీకి అనుగుణంగా అభివృద్ధి ఉండాలి. రెండో పెద్ద నగరం చుట్టూరా భవిష్యత్‌లో ఐటీ, వ్యాపార, వాణిజ్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలి. మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలించి, సవరించి వెంటనే ఆమోదించాలి. 
– బొమ్మినేని రవీందర్‌ రెడ్డి, అధ్యక్షుడు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, వరంగల్‌ 

మిశ్రమ వినియోగం కింద తీసుకోవాలి
మాస్టర్‌ప్లాన్‌లు ఎక్కడ అమలు చేసినా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. చాలాచోట్ల రాజకీయ జోక్యంతో విలీన గ్రామాల్లోని వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్, గ్రీన్‌ జోన్‌లోకి తీసుకుంటున్నారు. ప్రతిపాదిత వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో రైతులు, ఇతరుల నుంచి 3 వేల ఫిర్యాదులు అందాయి. పంట భూములను మిక్స్‌డ్‌ ల్యాండ్‌ యూజ్‌ (మిశ్రమ భూ వినియోగం)గా తీసుకుంటే వ్యతిరేకత రాదు. 
– పుల్లూరి సుధాకర్, అధ్యక్షులు, ఫోరం ఫర్‌ బెటర్‌ తెలంగాణ

మరిన్ని వార్తలు