అసైన్డ్‌ భూములపై కేసీఆర్‌ సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు!

4 Jan, 2023 09:33 IST|Sakshi

భూములు సేకరించి లేఅవుట్లుగా అభివృద్ధి 

సుమారు 3 వేల ఎకరాల్లో లేఅవుట్లు..  

ఎకరాకు 600 గజాలు అసైన్డ్‌దారుకు 

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో స్థలాల గుర్తింపు 

కలెక్టర్లకు లేఖలు రాసిన రాష్ట్ర ప్రభుత్వం  

భారీగా నిధులు వస్తాయని సర్కారు అంచనా  

సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్ర సర్కారు కాసుల వేట సాగిస్తోంది. ఖజానా నింపుకునేందుకు అసైన్డ్‌ భూములను అన్వేషిస్తోంది. వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తున్న భూములను సేకరించి.. లేఅవుట్లుగా అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తోంది.  

ధరలు ఆకాశాన్నంటడంతో.. 
- రాజధానికి చేరువలో ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. పారిశ్రామికాభివృద్ధి, ఐటీ కంపెనీల తాకిడితో ఈ రెండు జిల్లాల్లో  నగరీకరణ శరవేగంగా జరుగుతోంది. దీంతో స్థిరాస్తి రంగం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అసైన్డ్‌ భూములు సైతం పరాదీనమవుతున్నాయి.  భూమిలేని నిరుపేదలకు జీవనోపాధి నిమిత్తం వివిధ దశల్లో రాష్ట్ర ప్రభుత్వం భూములను పంపిణీ (అసైన్‌మెంట్‌) చేసింది.  

- ఈ భూములను వ్యవసాయ సాగుకు మాత్రమే వినియోగించుకోవాలని నిర్దేశించింది. ఒకవేళ ఇతర అవసరాలకు మళ్లించినా.. క్రయ విక్రయాలు జరిపినా చట్టరీత్యా నేరం. ఇవేమీ పట్టని కొందరు ఈ భూములను యథేచ్ఛగా విక్రయించారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే కారుచౌకగా ఈ భూములు అందుబాటులో ఉండడంతో బడాబాబులు, ప్రజాప్రతినిధులు ఇబ్బడిముబ్బడిగా కొనుగోలు చేశారు.  

- ఇలా అసైన్‌మెంట్‌ చట్టాన్ని ఉల్లంఘించినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఈ భూములక్రయ విక్రయాలకు అడూ అదుపూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అన్యాక్రాంతమవుతున్న అసైన్డ్‌ భూములను గుర్తించిన ప్రభుత్వం.. వీటిని ప్లాట్లుగా అభివృద్ధి చేయడం ద్వారా నిధుల సమీకరించుకోవాలనే ఆలోచన చేసింది. నగరానికి సమీపంలో ఉన్న ఈ తరహా భూములను గుర్తించి.. వాటిని లేఅవుట్లుగా అభివృద్ధి చేసి వేలం వేయాలని నిర్ణయించింది. ఈ అభివృద్ధి చేసిన భూమిలో ఎకరాకు 600 చదరపు గజాలను అసైన్డ్‌దారులకు ఇచ్చే విధంగా ప్రణాళికను రూపొందించింది. 

గజం రూ.40 వేల చొప్పున.. 
- ఉప్పల్‌ భగాయత్‌లో పట్టాదారుల భాగస్వామ్యంతో సేకరించిన హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) లేఅవుట్లుగా అభివృద్ధి చేసింది. దీంట్లో డెవలప్‌ చేసి ఎకరాకు వేయి గజాల చొప్పున పట్టాదార్లకు కేటాయించింది. ఇదే పద్ధతిని అసైన్డ్‌ భూములకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలను ఖరారు చేసి భూములను గుర్తించాలని కలెక్టర్లకు లేఖ రాసింది. ఈ మేరకు చర్లపటేల్‌ గూడ, కుర్మల్‌గూడ, తొర్రూర్, కవాడిపల్లి, చందానగర్, మునగనూరు, కొల్లూరు, పసుమాముల, తుర్కయంజాల్, లేమూరు, కొల్లూరులలో దాదాపు 3వేల ఎకరాలను ప్రాథమికంగా ఎంపిక చేసింది. 

- సేకరిస్తున్న అసైన్డ్‌ భూములకు ఆయా ప్రాంతాల్లో ఉన్న విలువ ఆధారంగా ఎకరాకు 600 గజాల నుంచి 800 వరకు ఇవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రైవేటు భూములతో పోలిస్తే అసైన్డ్‌ భూములకు ధర తక్కువ. వీటి క్రయవిక్రయాలపై నిషేధం ఉన్నందున.. ఇవి ఎకరాకు రూ.25 లక్షలు కూడా లభిస్తున్నాయి. 

- ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు వీటిని లేఅవుట్లుగా అభివృద్ధి చేయడం ద్వారా గజాన్ని సగటున రూ.40వేల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేస్తోంది. దీంతో అటు అసైన్డ్‌దారులు.. ఇటు ప్రభుత్వానికి ఉభయతారకంగా లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడం.. సంక్షేమ పథకాలకు నిధులు భారీగా అవసరం ఉండడంతో సాధ్యమైనంత త్వరగా అసైన్డ్‌ భూములను సేకరించి వెంచర్లుగా అభివృద్ధి చేసి నిధులను సమకూర్చుకోవాలనుకుంటోంది. దీంతో ఈ ప్రక్రియను వడివడిగా పూర్తి చేయాలని కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు