‘కాళేశ్వరం’ మరింత విస్తరణ!

11 Oct, 2020 02:33 IST|Sakshi

‘దేవాదుల’లో నీరందని 2.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం జలాలిచ్చేలా ప్రణాళిక 

మల్లన్నసాగర్, గంధమల రిజర్వాయర్ల నుంచి లింక్‌ కెనాల్‌ ద్వారా నీటి సరఫరా

సీఎం ఆదేశాలతో తుది ప్రతిపాదనలు సిద్ధం.. నేడో, రేపో మరోమారు సమీక్ష

సుమారు 25 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రచించింది. గోదావరి జలాల ఆధారంగా చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకంలో నీరందని చివరి ఆయకట్టు ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని రిజర్వా యర్‌ల ద్వారా నీరందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మల్లన్నసాగర్, గంధమల రిజర్వా యర్ల నుంచి లింక్‌ కెనాల్‌లను తవ్వి దేవాదుల లోని 2.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిం చాలని భావిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకట్రెండు రోజుల్లో సమీక్షించి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

‘మల్లన్న’ ద్వారా 1.37 లక్షల ఎకరాలు..
దేవాదులలో భాగంగా గంగాపురం ఇన్‌టేక్‌ పాయింట్‌ నుంచి నీటిని ఎత్తిపోస్తూ 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. నిర్ణీత ఆయకట్టుకు నీటిని తరలించాలంటే సుమారు 200 కి.మీ.కిపైగా నీటిని తరలించాల్సి ఉంది. ఇందుకోసం కనీసం 460 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాల్సి వస్తోంది. ఈ స్థాయిలో ఎత్తి పోతలు చేసినా చివరి ఆయకట్టుకు నీరందడం కష్టంగా ఉందని భావించిన ప్రభుత్వం... కాళేశ్వ రంలోని వివిధ రిజర్వాయర్ల నుంచి దేవాదుల చివరి ఆయకట్టుకు నీటిని తరలించే అంశాలపై అధ్యయనం చేసింది. కాళేశ్వరం ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటికి తోడు అదనంగా మరో టీఎంసీని తీసుకొనేలా పనులు చేపట్టినందున ఈ నీటిని మరింత సద్వినియోగం చేసుకొనేలా దేవాదులతో అనుసంధాన ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరపైకి తెచ్చారు.

ముఖ్యంగా మల్లన్నసాగర్‌ నుంచి దేవాదులలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి 11 కి.మీ. మేర గ్రావిటీ కెనాల్‌ నిర్మించి రోజుకు 44 క్యూమెక్కుల మేర నీటిని కనీసం 4 నెలలపాటు తీసుకెళ్లేలా ఇంజనీర్లు ప్రతిపాదనలు రూపొందించారు. కనీసం 15–16 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా తపాస్‌పల్లి కింద నిర్ణయించిన 82,500 ఎకరాలతోపాటు కన్నెబోయినగూడెం, వెల్దండ, లద్దనూరు దారి పొడవునా ఉండే చెరువుల కింద కలిపి మరో 55 వేల ఎకరాలు కలిపి 1.37 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనకు మొత్తంగా రూ. 80 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు.

గంధమల కెనాల్‌ నుంచి మరో 1.03 లక్షల ఎకరాలు..
ఇక మల్లన్నసాగర్‌ దిగువన ఉన్న గంధమల నుంచి బస్వాపూర్‌కు నీటిని తీసుకెళ్లే మెయిన్‌ కెనాల్‌ నుంచి లింక్‌ కెనాల్‌ తవ్వడం ద్వారా దేవాదుల కింద అశ్వరావుపల్లి, చిట్టకోడూరు, నవాబ్‌పేట మండలాల్లో ఉన్న ఆయకట్టుకు నీరిచ్చేలా మరో ప్రతిపాదన సిద్ధమైంది.  గంధమల నుంచి బస్వాపూర్‌ వెళ్లే ప్రధాన కాల్వ 17వ కి.మీ. వద్ద నుంచి నీటిని మళ్లించేలా మరో 20 కి.మీ. లింక్‌ కెనాల్‌ ద్వారా నీటిని తరలించాలన్నది ప్రతిపాదన. ఈ లింక్‌ కెనాల్‌ ద్వారా అశ్వరావుపల్లి కింద 34 వేల ఎకరాలు, చిట్టకోడూరు కింద 9 వేలు, నవాబ్‌పేట కింద 54 వేల ఎకరాలతోపాటు ఆ దారిలోని చెరువుల కింద ఉన్న మరో 4 వేల ఎకరాలు కలిపి మొత్తంగా 1.03 లక్షల ఎకరాలకు నీరివ్వనున్నారు.

ఈ లింక్‌ కెనాల్‌ ద్వారా 120 రోజులపాటు 10 టీఎంసీల మేర నీటిని తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదనకు రూ. 30–35 కోట్ల మేర ఖర్చవుతుందని లెక్కగట్టారు. మొత్తంగా 25 టీఎంసీల మేర కాళేశ్వరం జలాలను వినియోగిస్తూ దేవాదులలోని 2.40 లక్షల ఎకరాలకు సుమారు రూ. 100 కోట్ల ఖర్చుతోనే నీటిని అందించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి త్వరలో సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. 

మరిన్ని వార్తలు