సన్నాలపై మల్లగుల్లాలు

3 Nov, 2020 01:40 IST|Sakshi

బోనస్‌ ప్రకటనపై ప్రభుత్వం తర్జనభర్జన

ఆర్థికభారం ఎంత మేర ఉంటుందో లెక్కలు

4–5 రోజుల్లో నిర్ణయం తీసుకొనే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుత ఏడాది భారీగా దిగుబడి వస్తున్న సన్నరకం ధాన్యానికి బోనస్‌ లేదా అదనపు ప్రోత్సాహకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. బోనస్‌ లేదా ప్రోత్సాహకాలతో తమకు సంబంధం ఉండదని, అదనపు భారాన్ని పూర్తిగా రాష్ట్రాలే భరించాలని కేంద్రం స్పష్టం చేయడంతో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై తర్జన భర్జన పడుతోంది. అదనంగా రూ. 100 లేదా రూ. 200 ప్రకటిస్తే ఎంత భారం పడుతుందన్న దానిపై వ్యవసాయ, పౌర సరఫ రాలు, ఆర్థిక శాఖలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దీనిపై నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అధిక ధర కోసం డిమాండ్‌..
తెలంగాణలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా 34.45 లక్షల ఎకరాల్లో సన్నాలను పండిం చారు. ఈ లెక్కన 50 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర సన్న ధాన్యం సేకరిం చాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం గ్రేడ్‌–1 ధాన్యానికి రూ. 1,888, కామన్‌ రకానికి రూ. 1,868 మేర చెల్లిస్తున్నారు. సన్నాలకు ప్రత్యేక ధర ఏదీ నిర్ణయించకున్నా కామన్‌ రకం ధరలతోనే కొనుగోలు చేస్తున్నారు. నిజానికి గతేడాది బీపీటీ, జైశ్రీరాం, జయశ్రీ, చింటూ, శ్రీరామ్‌గోల్డ్, 1008, జీలకర్ర సోనా వంటి ధాన్యం రకాలకు రైతుల వద్దకే వెళ్లి నేరుగా కొన్న సమయాల్లోనూ క్వింటాల్‌కు రూ. 2,200కన్నా తక్కువకు అమ్ముడుపోలేదు. అదే మిల్లర్ల వద్దకే తీసుకొని అమ్ముకుంటే రైతులకు రూ. 2,500 వరకు ధర పలికింది. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. మిల్లర్లు సన్న రకాలకు రూ. 1,700 నుంచి రూ. 1,800 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. దీంతో కనిష్టంగా రూ. 500 వరకు రైతులు ధర కోల్పోతున్నారు.

ముఖ్యంగా సన్నరకం అధికంగా సాగు చేసిన నల్లగొండ, కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల రైతులు ప్రస్తుతం మార్కెట్‌లోని ధరల తీరుతో భారీగా నష్టపోతున్నారు. అయితే ప్రభుత్వం 17 శాతం వరకే తేమ శాతాన్ని నిర్ణయించగా, 30 శాతం వరకు తేమ ఉన్నా తాము కొనుగోలు చేస్తున్నామని మిల్లర్లు అంటున్నారు. దొడ్డు రకానికంటే సన్నరకం ధాన్యం పంటకు చీడపీడల బాధ, పెట్టుబడి ఎక్కువగానే ఉంటుంది. దొడ్డు ధాన్యంతో పోలిస్తే సన్నాలకు దిగుబడి కూడా తక్కువే. దొడ్డు రకం అయితే ఎకరానికి 40–45 బస్తాలు పండుతాయి. అదే సన్నాలయితే ఎకరాకు 25–30 బస్తాలకు మించి పండదు. అయినప్పటికీ రైతులు సన్నాలకు అధిక ధర వస్తుందని ఈ పంట సాగు చేస్తున్నా దొడ్డురకం ధాన్యంతో సమానమైన ధరే లభిస్తోంది. ఈ నేపథ్యంలో సన్నాలకు అధిక ధర ఇవ్వాలని రైతుల నుంచి డిమాండ్‌ వస్తోంది. 

మరిన్ని వార్తలు