వైద్యుడి బాడీలాంగ్వేజ్‌ కూడా కీలకమే...

22 Nov, 2021 02:25 IST|Sakshi

పేలవ సమాచారంతోనే డాక్టర్లపై దాడులు 

కమ్యూనికాన్‌ సదస్సులో గవర్నర్‌ తమిళిసై

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): వైద్య రంగంలో రోగులతో సమాచార మార్పిడి అత్యావశ్యకమని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో రెండు రోజుల సదస్సు కమ్యూనికాన్‌–2021 ముగింపు సందర్భంగా ఆదివారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఒక వైద్యురాలిగా రోగులతో సమాచారం ఎంత కీలకమో తనకు తెలుసునన్నారు. 8 నుంచి 38 శాతం మంది వైద్యులు ఏదో ఒక సమయంలో భౌతికంగా లేదా మానసికంగా హింసను ఎదుర్కొంటున్నారని తమిళిసై చెప్పారు.

రోగుల ఆరోగ్య పరిస్థితిపై వారి కుటుంబీకులకు సరైన రీతిలో సమాచారం ఇవ్వలేకపోవడమే దీనికి కారణమన్నారు. రోగిని ఒప్పించడానికి 20 శాతం నాలెడ్జ్, 80 శాతం సమాచారం అవసరమని వైద్యులకు ఆమె సూచించారు. రోగులు అర్థం చేసుకునే విధంగా కమ్యూనికేట్‌ చేస్తే చికిత్స విషయంలో వారిని ఒప్పించవచ్చన్నారు. రోగులతో సమాచార మార్పిడిలో శరీర భాష కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందన్న విషయాన్ని వైద్యులు గుర్తించాలన్నారు. ఈ సదస్సులో అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కె.హరిప్రసాద్, వైద్య శాస్త్ర జాతీయ పరీక్షల బోర్డు అధ్యక్షుడు డాక్టర్‌ అభిజిత్, క్యాడిలా ఫార్మా సీఎండీ రాజీవ్‌ మోదీ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు