తెలంగాణ: మేడమ్‌ వర్సెస్‌ సార్‌.. తగ్గట్లే.. ఒకరిని మించి మరొకరు!

27 Jan, 2023 14:42 IST|Sakshi

తెలంగాణలో గవర్నర్ తమిళసైకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య ఏర్పడిన విభేదాలు.. చివరికి రిపబ్లిక్ దినోత్సంపై కూడా ప్రతిబింబిండం దురదృష్టకరం. రాజకీయాలకు,వివాదాలకు అతీతంగా ఉండవలసిన ఈ ఉత్సవం మొత్తం గందరగోళంగా మారింది. రిపబ్లిక్ డే జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టుకు వెళ్లే పరిస్థితి రావడం కేసీఆర్ ప్రభుత్వానికి సొబగు కాదు. కేసిఆర్ మొండి పట్టుదలకు పోతున్నారనిపిస్తుంది. చివరికి రాజ్ భవన్ లో తమిళసై రిపబ్లిక్ డే ని నిర్వహించడం, ఆ సందర్భంగా యధాప్రకారం ప్రభుత్వంపై విమర్శలు చేయడం కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇబ్బందికరమైన పరిణామమే. ఆ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి.

ఆమె ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు మంచిదే. కాని తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయని అనడం పద్దతికాదు. ఆ లెక్కలు ఆమెకు ఎవరు ఇచ్చారు. ఆత్మహత్యల వంటి సెంటిమెంట్ అంశాలను గవర్నర్ లేవనెత్తడం రాజకీయ ప్రేరితం అవుతుంది. రాజకీయ పక్షాల వారు ఏమైనా విమర్శలు చేసుకోవచ్చు. కానీ, గవర్నర్ ఒక రాజకీయనేత మాదిరి అలాంటి విమర్శలు చేయడాన్ని  ఎవరూ ఆహ్వానించలేరు. అయితే హైదరాబాద్ ,ఇతర ప్రాంతాలలో జాతీయ రహదారులు, వంతెనల నిర్మాణానికి కేంద్రం నిదులు ఇస్తోందని ఆమె చెప్పడం విశేషం. సాదారణంగా రిపబ్లిక్ డే నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించే ప్రసంగ పాఠాన్ని చదువుతారు. కానీ, కొన్నిసార్లు గవర్నర్ లు తమ సొంత అబిప్రాయాలను చొప్పిస్తున్నారు. అది కొంచెం వివాదం అవుతున్నా, స్థూలంగా సర్దుకు పోతుంటారు. కానీ, తెలంగాణలో శృతి మించి అసలు రిపబ్లిక్ డే నే పూర్తి స్థాయిలో జరపలేకపోవడం ప్రభుత్వానికి ప్రతిష్టకాదు.  

కాగా ఈ సందర్భంగా తమిళసై వేసిన ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కరోనా కారణంగా రిపబ్లిక్ డే జరపలేకపోతున్నట్లు ప్రభుత్వం చెప్పడాన్ని ఆమె తప్పుపడుతూ ఖమ్మంలో ఐదు లక్షల మందితో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఎలా జరిగిందని ఆమె ప్రశ్నించారు. తాను నచ్చకపోయినా, గవర్నర్ కు ఇవ్వవలసిన మర్యాద ఇవ్వాలి కదా అన్న ఆమె   భావనను ఎవరైనా అంగీకరించాలి. గత రెండేళ్లుగా తమిళసైకి , కేసీఆర్‌కు మధ్య బాగా అంతరం ఏర్పడింది. చివరికి తమిళసై జిల్లాల పర్యటనలకు వెళితే జిల్లా కలెక్టర్, ఎస్పీ  హోదా అధికారులు కూడా వచ్చి  స్వాగతం పలకడం లేదు. ఇది కూడా బాగోలేదు.  

గవర్నర్ బిజెపి కోసం రాజకీయం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ మంత్రులు విమర్శలు చేస్తున్నా, ముందుగా తాము ఎంత మేర ఆమెను గౌరవిస్తున్నది వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. కేంద్రంతో తగాదా పడుతున్నది మొదలు గవర్నర్‌తో కూడా గొడవ సాగుతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ నియమిస్తున్న గవర్నర్‌లు.. బీజెపీయేతర ప్రభుత్వాలు ఉన్నచోట్ల పలు అవాంతరాలు సృష్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నమాట నిజమే . గతంలో  ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు ఉన్నప్పుడు కూడా ఆనాటి గవర్నర్ లు రామ్ లాల్, కుముద్ బెన్ జోషి వంటివారితో తీవ్రస్థాయిలో వివాదాలు చోటు చేసుకున్నాయి. అయినా రిపబ్లిక్ డే వంటి వాటి విషయంలో ప్రభుత్వాలు ఇంత తీవ్రమైన నిర్ణయం చేయలేదని చెప్పాలి. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 

కేసీఆర్‌కు పోటీగా తమిళసై కూడా విమర్శల ధాటి పెంచారు. రిపబ్లిక్ డే పరిణామాలపై కేంద్రానికి ఆమె నివేదిక కూడా పంపించారు. ఇంతమాత్రాన ఏదో అయిపోతుందని కాదు., ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రతిదానికి రాజకీయ రంగు పులుముకుంటోంది. జాతీయ రాజకీయాలలో తనదైన పాత్ర పోషించాలని బావిస్తున్న కేసీఆర్ కు  ఈ వివాదం  ఏ విదంగా ఉపయోగపడుతుందో కాలమే చెబుతుంది. గవర్నర్ వ్యవస్థ పలుమార్లు దుర్వినియోగం అవుతోందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, అంతమాత్రాన ఆ వ్యవస్థ రద్దు అయ్యే పరిస్థితి లేదు. అందువల్ల ఇరువైపులా సర్దుకుపోవడం మంచిది అని చెప్పాలి. కానీ, వర్తమాన రాజకీయాలలో పట్టుదలలకు విశేష ప్రాధాన్యం వస్తున్న నేపద్యంలో ఇది అంత తేలికైన వ్యవహారం కాకపోవచ్చు.

::హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు