తారా స్థాయికి చేరిన గవర్నర్‌, రాష్ట్ర సర్కార్‌ మధ్య విభేదాలు..

8 Apr, 2022 10:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ సాగుతున్న ‘పంచాయితీ’ ముదిరి పాకాన పడింది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వతీరు, టీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలపై గవర్నర్‌ తీవ్రం గా స్పందించారు.

రాష్ట్ర ప్రభుత్వం తనను గౌరవించడం లేదని, రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదనే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ప్రతిగా కొందరు రాష్ట్ర మంత్రులు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. రాజ్‌భవన్‌ బీజేపీ పార్టీ కార్యాలయంలా మారిందని విమర్శలు గుప్పిస్తున్నారు. 

మోదీ, అమిత్‌ షాతో భేటీపై ఆసక్తి 
రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల అనుసరిస్తున్న తీరుపై తమిళిసై గతంలోనే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకల సందర్భంగా.. తాను శక్తిమంతురాలినని, బలవంతంగా ఎవరూ తన తలవంచలేరంటూ స్వ రం పెంచారు. అదే సమయంలో సీఎం, మంత్రులతో చర్చకు సిద్ధమని, ఎవరికైనా రాజ్‌భవన్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కూడా అన్నారు. తాజాగా రెండు రోజులు ఢిల్లీలో మకాం వేసి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ను కలవడం ద్వారా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపారు.

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం మొదలు మండలి ప్రొటెమ్‌ చైర్మన్‌ నియామకం, బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకపోవడం, మేడారం జాతర, యాదగిరిగుట్ట పర్యటనలో ప్రొటోకాల్‌కు తిలోదకాలివ్వడం తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. వీటిపై ఫిర్యాదులతోపాటు ప్రభుత్వ పా లన వైఫల్యాలు, శాంతిభద్రతలు, డ్రగ్స్, అవినీతి వంటి అం శాలపై గవర్నర్‌ నివేదిక సమర్పించినట్లు తెలిసింది. 

మీకే కాదు..మాకూ అవమానమే! 
రాష్ట్రంలో తనకు ఎదురైన అవమానాల గురించి కేంద్ర పెద్దలకు గవర్నర్‌ వివరించగా.. ‘ఈ అవమానం మీకే కాదు.. మాకూ జరిగినట్టు భావిస్తున్నాం’ అని వారు బదులిచ్చారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగేలా రోడ్డు, రైలు మార్గాల్లో రాష్ట్రం నలుమూలలా పర్యటించేందుకు గవర్నర్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ప్రజల నుంచి ఫిర్యాదులు, విజ్ఞాపనలను స్వీకరించడానికి వచ్చే నెల నుంచి రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

(చదవండి: బీజేపీ బెటాలియన్‌ ఏదైనా నాతో యాదాద్రికి వచ్చిందా?)

మరిన్ని వార్తలు