‘పాలమూరు’ అవసరమని ప్రధానే అన్నారు 

29 Dec, 2022 03:42 IST|Sakshi
పాలమూరు ప్రాజెక్టు (ఫైల్‌)

సత్వరమే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వండి 

సీడబ్ల్యూసీకి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించిన తెలంగాణ 

శ్రీశైలంలో 230 టీఎంసీల లభ్యత నుంచి 90 టీఎంసీలను కేటాయించాం 

పోలవరంతో 80 టీఎంసీల గోదావరి తరలింపునకు బదులుగా.. 80 టీఎంసీల కృష్ణా జలాలను ఎగువ రాష్ట్రాలకు బచావత్‌ కేటాయించింది 

అందులో తెలంగాణ వాటా 45 టీఎంసీలను పాలమూరుకు కేటాయించాం 

మైనర్‌ ఇరిగేషన్‌ కోటాలో మిగులుగా ఉన్న మరో 45 టీఎంసీలు సైతం 

సాక్షి, హైదరాబాద్‌: కరువుపీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను 2014లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ స్వయంగా ప్రస్తావించారని, అందువల్ల ఈ ప్రాజెక్టుకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ప్రాజెక్టుకు అనుమతులపై సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టు అప్రైజల్‌ ఆర్గనైజేషన్‌ (పీపీవో) చీఫ్‌ ఇంజనీర్‌కు బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ప్రధాని నాడు చేసిన ప్రసంగాన్ని సైతం ప్రదర్శించింది. ఉమ్మడి ఏపీలో 2013 ఆగస్టు 8న ప్రాజెక్టు సమగ్ర సర్వే కోసం రూ. 6.91 కోట్లను విడుదల చేస్తూ జీవో నంబర్‌ 72 జారీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది.

60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు వివరించింది. శ్రీశైలం జలాశయంలో అన్ని అవసరాలు పోనూ మిగిలిన 230 టీఎంసీల్లో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులైన పాలమూరు–రంగారెడ్డికి 90 టీఎంసీలు, శ్రీశైలం ఎడమగట్టు కాల్వకు 40 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 40 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల పథకానికి 30 టీఎంసీల నీటి లభ్యత ఉందని రాష్ట్రం స్పష్టం చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ సి.మురళీధర్, పాలమూరు–రంగారెడ్డి చీఫ్‌ ఇంజనీర్‌ హమీద్‌ ఖాన్‌ హాజరయ్యారు. 

శ్రీశైలంలో 582.5 టీఎంసీల లభ్యత.. 
75 శాతం డిపెండబులిటీ (వందేళ్లలో కచ్చితంగా వచ్చిన 75 ఏళ్ల వరద) ఆధారంగా శ్రీశైలం జలాశయంలో 582.5 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఇందులో నాగార్జునసాగర్‌ అవసరాలకు 280 టీఎంసీలు, హైదరాబాద్‌ తాగునీటికి 16.5 టీఎంసీలు, చెన్నై నగర తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, 22 టీఎంసీల ఆవిరి నష్టా లు కలుపుకుని మొత్తం 352.50 టీఎంసీలు అవసరమని, మిగిలిన 230 టీఎంసీల్లో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టు అయిన పాలమూరు–రంగారెడ్డికి 90 టీఎంసీలు అవసరమని తెలంగాణ తెలిపింది.

మైనర్‌ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన 45 టీఎంసీలతోపాటు పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలు వాడుకోవాలని 1978 ఆగస్టు 4న బచావత్‌ ట్రిబ్యునల్‌ ముందు ఒప్పందం జరిగిన విషయాన్ని తెలంగాణ గుర్తుచేసింది. ఈ ఒప్పందం ప్రకారం 35 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటకలు వాడుకోగా మిగిలిన 45 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డికి కేటాయించామని తెలిపింది.

తెలంగాణలో మైనర్‌ ఇరిగేషన్‌ అవసరాలకు 90.81 టీఎంసీలను బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిందని, 2012– 13 నుంచి 2021–22 మధ్య 45.15 టీఎంసీలను మైనర్‌ ఇరిగేషన్‌లో పొదుపు చేసినట్లు తెలియజేసింది. ఇలా పొదుపు చేసిన 45 టీఎంసీలతోపాటు పోలవరం ద్వారా గోదావరి జలాల తరలింపుతో లభించనున్న 45 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించినట్టు వివరించింది.

రూ. 55 వేల కోట్లకు పెరిగిన వ్యయం.. 
తొలిదశలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు, హైదరాబాద్‌ నగరంతోపాటు 1,226 గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం పనులు చేపట్టేందుకు గతంలో ఎన్జీటీ సైతం అనుమతిచ్చిందని తెలంగాణ తెలిపింది. గత ఆగస్టు 24న రెండోదశ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించింది. 2015లో రూ. 35,200 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా ప్రస్తుతం రూ. 55,086 కోట్లకు పెరిగిందని తెలిపింది.  

మరిన్ని వార్తలు