భూముల వేలంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

20 Jul, 2021 17:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై భారీగా అవినీతి ఆరోపణలు వస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. భూముల వేలంపై ఓ పత్రిక ప్రకటన విడుదల చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో హెచ్చరించింది. బిడ్డింగ్‌లో కొన్ని సంస్థలకు మేలు చేశామన్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూను తగ్గించలేదు.. కల్పిత ఆరోపణలు చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. వేలం పారదర్శకంగా జరిగిందని పునరుద్ఘాటించింది.

వేలంలో పాల్గొనకుండా ఎవరినీ నియంత్రించలేదని పేర్కొంది. భూముల వేలానికి కొందరు ప్రతిపాదిస్తున్న స్విస్‌ ఛాలెంజ్‌ విధానం సరికాదని స్పష్టం చేసింది. ఆ పద్ధతి పోటీ కొందరికే అవకాశం లభిస్తుందని వివరించింది. భూముల వేలంపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ భూముల వేలంతో దాదాపు 3 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

అయితే ఈ భూముల వేలంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. భూముల వేలంతో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేశారు. దీన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. వేలంపై మరికొందరు కూడా విమర్శలు చేయడంతో ప్రభుత్వం స్పందించి పై ప్రకటనను విడుదల చేసింది.

మరిన్ని వార్తలు