డిగ్రీలో కోర్సు ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు

17 May, 2022 03:37 IST|Sakshi
ప్రొఫెసర్‌ లింబాద్రి 

సామాజిక కోర్సుల ఎంపికలో వెసులుబాటు

జీరో అడ్మిషన్ల కాలేజీల మూసివేత

ఇతర రాష్ట్రాల విద్యార్థుల కోటా పెంపు

వీసీల సమావేశంలో కీలక నిర్ణయాలు

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యలో సంస్కరణలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. డిగ్రీలో ఏ కోర్సు చేసినా పీజీలో ఇష్టమైన సామాజిక కోర్సు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ఇతర రాష్ట్ర విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచాలని తీర్మానించింది. సోమవారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి మీడియాకు వివరించారు. 

బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌కు సరికొత్త విధానం
ఇప్పటివరకు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ఏ సబ్జెక్టు తీసుకుంటే పోస్టు గ్రాడ్యుయేషన్‌లోనూ అదే కోర్సు చేయాల్సి ఉండేది. దీని వల్ల చాలా మంది విద్యార్థులు ఇష్టమైన సబ్జెక్టులు చదివేందుకు వేరే రాష్ట్రాలు, దేశాలకు వెళ్తున్నారు. అందుకే ఉమ్మడి పోస్టు గ్రాడ్యుయేట్‌ అర్హత పరీక్ష నిబంధనలు సడలించారు. ఇక సోషల్‌ సైన్స్‌ గ్రూపులైన ఎంఏ పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్‌ వంటి కోర్సులు ఇంగ్లిష్, తెలుగులో చేయాలంటే డిగ్రీలో ఏ కోర్సు చేసినా సరిపోతుంది.

ఉన్నత విద్యలో విద్యార్థులకు ఇచ్చే బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌పై కూడా సరికొత్త విధానం తీసుకొచ్చేందుకు అధ్యయనం చేయాలని ఉస్మానియా వర్సిటీ వీసీకి ఉన్నత విద్యా మండలి సూచించింది. రాష్ట్రంలో మూడేళ్లుగా దాదాపు 50 కాలేజీల్లో పలు కోర్సుల్లో జీరో ప్రవేశాలు ఉంటున్నాయి. వీటిని రద్దు చేయడమే మంచిదని మండలి భావిస్తోంది. అయితే డిమాండ్‌ ఉన్న కోర్సులను కాలేజీలు నిర్వహించుకునేందుకు అనుమతించడంపై కసరత్తు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థుల్లేని గ్రూపుల స్థానంలో విద్యార్థులు కోరుకునే గ్రూపులకు కాలేజీలు ముందుకొస్తే పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. 

పీజీ ఎంట్రన్స్‌లో నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కోటా 20 శాతం
పీజీ ఎంట్రన్స్‌లో నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కోటాను 20 శాతం పెంచాలని సమావేశం తీర్మానించింది. ప్రస్తుతం ఈ కోటా 5 శాతమే ఉంది. తాజా నిర్ణయంతో కొత్తగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. దీనికోసం సూపర్‌ న్యూమరరీ సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. స్పానిష్, ఫ్రెంచ్, జపనీస్‌ వంటి విదేశీ భాషల కోర్సులను కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు విద్యా మండలి సుముఖత వ్యక్తం చేసింది.

ఇందుకు సంబంధించిన పాఠ్య ప్రణాళిక, బోధన విధానంపై సమగ్ర నివేదిక రూపొందించే బాధ్యతను ఉస్మానియా వర్సిటీ వీసీ రవీందర్‌కు అప్పగించింది. సమావేశంలో రాష్ట్ర కాలేజీ విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, విద్యా మండలి వైఎస్‌ చైర్మన్‌ వెంకటరమణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు